అమరాపురం/అగళి: స్థానికేతరుడైనా మా‘రాజు’ అని ఎన్నికల్లో గెలిపిస్తే ఇప్పుడేమో మా కష్టాలు పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తిరుగుతున్నారని అమరాపురం మండలం తమ్మడేపల్లి, అగళి మండలం కురసాంగనపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యపై గ్రామస్తులు బుధవారం ఆందోళన చేపట్టారు. తమ్మడేపల్లిలోని రాజీవనగర్ సచివాలయం ఎదుట కాలనీ వాసులు ఖాళీ బిందెలతో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలనీ వాసులు శ్రీనివాస్, గంగమ్మ, కెంచమ్మ, మంజమ్మ, భాగ్యమ్మ, తిమ్మక్క తదితరులు మాట్లాడుతూ.. తమ కాలనీ కోసం ఏర్పాటు చేసిన బోరుబావిలో నీరు సమృద్ధిగా ఉన్నా, 15 రోజులుగా చుక్క తాగునీరు సరఫరా కావడం లేదని మండిపడ్డారు. గ్రామ సచివాలయంలో విన్నవించేందుకు వస్తే ఇక్కడ ఒక్కరూ కూడా అందుబాటులో లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగూ ఆయన అందుబాటులో ఉండడం లేదని, కనీసం అధికారులైన అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. అలాగే అగళి మండలం కురసాంగనపల్లిలో తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన బోరు బావిలో నీరు అడుగంటిందని, మూడు రోజులుగా తాగునీటి కోసం నానా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి సురేష్ అక్కడకు చేరుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు.
అమరాపురం మండలం తమ్మడేపల్లి గ్రామ సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు
అగళి మండలం కురసాంగనపల్లిలో ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన తెలుపుతున్న గ్రామస్తులు


