● విజయవాడలో నినదించిన వైఎస్సార్‌టీఏ నాయకులు
పుట్టపర్తి: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ విజయవాడ వేదికగా వైఎస్సార్‌టీఏ నాయకులు బుధవారం నినదించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున ఉపాధ్యాయులు విజయవాడ చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. వీరిలో వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి లీలా ఇంద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీద్, నాయకులు భాస్కరరెడ్డి, ప్రతాపరెడ్డి, శివయ్య, శ్రీనివాసరెడ్డి, కిష్టప్ప, శ్రీనివాసులు, మనోహర్‌రెడ్డి, సునీత, అనిత, ఇందిర, సురేష్, మహమ్మద్ అలీ, జమీర్, ప్రభాకర్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందరాదు
●ఆర్టీసీ కడప జోన్ ఈడీ రాఘవకుమార్
పుట్టపర్తి టౌన్ : ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందకుండా నాణ్యమైన సేవలు అందించాలని ఆర్టీసీ అధికారులను కడప జోన్ ఈడీ రాఘవకుమార్ ఆదేశించారు. బుధవారం పుట్టపర్తిలోఆర్టీసీ బస్టాండ్, డిపో కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, డిపోలోని విడిభాగాలను పరిశీలించారు. అందుతున్న సౌకర్యాలపై ప్రయాణికులతో ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 45 ఏళ్లు దాటిన ప్రతి ఉద్యోగి హెల్త్ కార్డులు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఆరోగ్యం పట్ల ఽశ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం ఉద్యోగ నిర్వహణలో ప్రతిభ కనబరచిన డ్రైవర్లను సన్మానించారు. కార్యక్రమంలో డీపీటీఓ మధుసూదన్, డీవైఈఈ సురేంద్రబాబు, డిపో మేనేజర్ ఇనాయతుల్లా, సూపర్‌వైజర్ విజయానంద్, శోభారాణి పాల్గొన్నారు.
పత్తి విత్తనం విక్రయ దుకాణాల తనిఖీ
పెనుకొండ: స్థానికంగా పత్తి విత్తనాన్ని విక్రయిస్తున్న దుకాణాలను వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఏడీఏ జి.కళ్యాణ్ బుధవారం తనిఖీ చేసారు. హెర్బిసైడ్ టాలరెంట్ (హెచ్‌టీ) రకం పత్తి విత్తనాల అమ్మకాలను నిరోధించేందుకు స్థానిక అధికారులతో కలసి తనిఖీలు చేపట్టినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. హెచ్‌టీ రకం పత్తి విత్తనాల సాగుతో మానవాళికి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, భూసారం తీవ్రంగా దెబ్బతింటుందని, వీటిని రైతులకు విక్రయించరాదని డీలర్లకు సూచించారు. కార్యక్రమంలో ధర్మవరం మండల వ్యవసాయాధికారి ముస్తాఫా, అనంతపురం వ్యవసాయాధికారి శ్రీనాథరెడ్డి, పెనుకొండ మండల ఏఓ చందన, ఏఈఓ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
దారితప్పితే కఠిన చర్యలు
● రౌడీ షీటర్లను హెచ్చరించిన
అదనపు ఎస్పీ అంకితా సురానా
హిందూపురం: దారి తప్పి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రౌడీ షీటర్లను అదనపు ఎస్పీ అంకితా సురానా హెచ్చరించారు. బుధవారం హిందూపురంలో డీఎస్పీ మహేష్, సీఐలతో కలిసి ఆమె పర్యటించారు. గుడ్డం ఏరియా, రహమత్‌పూర్, బోయపేట, నింకంపల్లి, మోతుకపల్లి తదితర ప్రాంతాల్లోని రౌడీషీటర్ల ఇళ్లను పరిశీలించారు. కుటుంబసభ్యులకు పలు సూచనలు చేశారు. మళ్లీ గొడవల్లో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు పట్టణ బహిష్కరణ ఉంటుందన్నారు. మంచి ప్రవర్తనతో మెలిగి కుటుంబ సభ్యులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు.


