బత్తలపల్లి: అనంతపురం రూరల్ మండలం మన్నీల క్రాస్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన తిరుపాలు వ్యక్తిగత పనిపై బుధవారం ఉదయం అనంతపురానికి ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన రామకృష్ణ (65) అభ్యర్థన మేరకు ఆయనను కూడా ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు. మన్నీల క్రాస్ వద్దకు చేరుకోగానే రోడ్డుపై పడిన కంకర రాళ్లపై చక్రం ఎక్కడంతో బైక్ అదుపు తప్పి ఇద్దరూ కిందపడ్డారు. ఘటనలో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా, తలకు తీవ్రగాయమైన తిరుపాలును స్థానికులు వెంటనే 108 వాహనంలో బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. కాగా, గ్రామంలో రామకృష్ణ ఆర్‌ఎంపీగా ప్రజలకు సేవలు అందిస్తూనే ఆర్టీసీలో కాంట్రాక్ట్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. గతంలోనే ఆయన భార్య మృతి చెందింది. పిల్లలు లేరు. ఘటనపై ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
సింగపూర్ వేదికగా బోద్ధ కావ్యం ఆవిష్కరణ
పెనుకొండ: స్థానిక కవి, రచయిత జాబిలి చాంద్‌బాషా కలం నుంచి జాలువారిన బోద్ధ కావ్యాన్ని మంగళవారం రాత్రి సింగపూర్‌లో ఆవిష్కరించారు. సింగపూర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో జాబిలి చాంద్‌బాషా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. సింగపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థిని సంపూర్ణ మానవుడిగా తీర్చిదిద్ది సమాజానికి అర్పించే ఉపాధ్యాయుడు ఒక సజీవ విశ్వవిద్యాలయమని కొనియాడారు. సమాజంలోని ప్రతి కీలక రంగం ఉపాధ్యాయుడి బోధన నుంచే ఉద్భవిస్తుందన్నారు. బోద్ధ కావ్యం ఉపాధ్యాయ లోకానికి గొప్ప ప్రేరణనిస్తుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరమణ, మహేశ్వరరెడ్డి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత తిరుమల శ్రీదేవి, ప్రిన్సిపాల్ యశోదలక్ష్మి, అరుణాయాదవ్, ప్రధానోపాధ్యాయులు సుధాకర్, మక్బూల్‌బాషా, విద్యాభారతి, మాణిక్యం, ఇషాక్, బండి శ్రీనివాసులు, ఖాదర్, నౌషాద్, ఆది, సుబ్రహ్మణ్యశర్మ తదితరులు పాల్గొన్నారు.
దుకాణదారుడిపై కత్తితో దాడి
ముదిగుబ్బ: సిగరెట్లు అప్పుగా ఇవ్వలేదంటూ దుకాణదారుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన బుధవారం ముదిగుబ్బ గేటు కొట్టాలలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన మేరకు.. ముదిగుబ్బ గేటు కొట్టాలలో దుకాణం నిర్వహిస్తున్న మణికంఠ వద్దకు బుధవారం ఉదయం స్థానికుడు వసంత్ వెళ్లి సిగరెట్లు అడిగాడు. నగదు చెల్లిస్తేనే సిగరెట్లు ఇస్తానని మణికంఠ తెలపడంతో వసంత్ అప్పటికే తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న కత్తితో దాడి చేసి పొట్టలో బలంగా పొడిచి ఉడాయించాడు. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కదిరికి తీసుకెళ్లారు.


