పెనుకొండ: స్థానిక అర్బన్ కాలనీలో టీడీపీ నేతలు ఏకపక్షంగా జరిపిన దాడిలో ఆరుగురు గాయపడ్డారు. దీంతో అర్బన్ కాలనీలో భయానక వాతావరణం నెలకొంది. ఘటనపై బాధితులు బుధవారం వాట్సాప్ ద్వారా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివరాలు.. అర్బన్ కాలనీలో ఇష్టారాజ్యంగా ద్విచక్రవాహనాలను డ్రైవింగ్ చేస్తున్న యువకులను బాబా అనే వ్యక్తి నిలువరించి జిగ్‌జాగ్ డ్రైవింగ్ చేయొద్దని సూచించాడు. కాలనీలో చిన్నపిల్లలు రోడ్డుపై ఆడుకుంటూ ఉంటారని ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే అందరూ బాధపడాల్సి ఉంటుందని హితవు పలికాడు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు నవాజ్, మరికొందరు మంగళవారం అర్ధరాత్రి సమయంలో అర్బన్ కాలనీకి చేరుకుని బాబాతో ఘర్షణకు దిగారు. సర్థి చెప్పడానికి వచ్చిన బాబా అల్లుళ్లపై ఇష్టారాజ్యంగా రాళ్లు,, కర్రలతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాబా, అతని అల్లుళ్లు, మరి కొందరిని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై బుధవారం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసి, తమకు రక్షణ కల్పించాలంటూ ఎస్పీకి వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. దాడిలో 10 మంది యువకులు పాల్గొన్నారని పేర్కొన్నారు.


