● డిమాండ్లు పరిష్కరించేదాకా సమ్మె విరమించబోమంటున్న కార్మికులు
బత్తలపల్లి: శ్రీసత్యసాయి రక్షిత తాగునీటి పథకం కార్మికుల సమ్మెతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. మంగళవారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 800 మంది కార్మికులు నిరవధిక సమ్మెను సత్యసాయి పంప్‌హౌస్‌ల వద్ద చేపట్టారు. బత్తలపల్లిలో కార్మికులు నీటి ట్యాంకుల వద్ద సమ్మెకు దిగారు. పథకం నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల వేతనం మంజూరు తదితర డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేపట్టినట్లు కార్మికులు పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు అప్పరాచెరువు సమీపంలోని సత్యసాయి పంపుహౌస్ వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా.. సత్యసాయి కార్మికుల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. అధికారులు, ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కార్మికులతో చర్చించి సమ్మెను విరమింపచేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఆర్‌ఓ ప్లాంట్లు
పనిచేసేలా చూడండి
ధర్మవరం అర్బన్: సెలవులు ముగిసిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయని ఆర్‌ఓ ప్లాంట్లకు మరమ్మతులు చేయించి పనిచేసేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం పది మండలాల హెచ్‌ఎంలతో ఆయన సమావేశం నిర్వహించారు. డీఈఓ కిష్టప్ప మాట్లాడుతూ ‘మన బడి – మన భవిష్యత్తు’ కింద జిల్లాలో 1248 ఆర్‌ఓ ప్లాంట్లు ఫేస్–1, ఫేస్–2 కింద మంజూరయ్యాయని పేర్కొన్నారు. కొన్ని పాఠశాలల్లో ఆర్‌ఓ ప్లాంట్లు పనిచేయలేదని చెప్పారు. జూన్ 12న పాఠశాలలు ప్రారంభించే సమయానికి ప్రతి పాఠశాలలో ఉన్న ఆర్‌ఓ ప్లాంటు పనిచేసేటట్లు చూడాలని ఆదేశించారు. పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమెడియన్ క్లాసులు నిర్వహించాలన్నారు. ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి విద్యార్థిని ప్రాథమిక పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎంఈఓ గోపాల్‌నాయక్, సీఎంఓ హరిప్రసాద్, ఏపీఓ ఫణిరాజ్‌శర్మ, ఏఎస్‌ఓ మాధవరెడ్డి, కొత్తపేట పాఠశాల హెచ్‌ఎం పద్మావతి, ఆర్‌ఓ ప్లాంట్ల టెక్నీషియన్లు కిశోర్, నగేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


