రొళ్ల: ‘మేము అధికారంలో ఉన్నాము.. మేము చెప్పిందే జరగాలి.. లేకపోతే నీరు, నీడ లేని చోటికి ట్రాన్స్‌ఫర్ చేయిస్తాం.. అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయాలి ఖబర్దార్’ అని మడకశిర మార్కెట్ యార్డు చైర్మన్ బీఎస్ గురుమూర్తి స్థానిక ఇన్‌చార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసరావుతో పాటు ఇతర శాఖ అధికారులపై చిందులు వేశారు. ఆ తర్వాత సభ మధ్యలో నాయకుల కోసం వేసిన కూర్చీలను చెప్పు కాళ్లతో తన్ని సర్వసభ్య సమావేశాన్ని అగౌరవ పరచడంతో పాటు సభ జరగకుండా అడ్డుకున్నారు. వివరాలు... రొళ్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశం మందిరంలో మంగళవారం మండలాధ్యక్షురాలు ఎస్‌ఆర్ సుమ అధ్యక్షతన సాధారణ మండల సర్వసభ్య సమావేశం జరిగింది. అయితే సభావేదికపై తమవారికి ప్రత్యేకంగా చైర్లు వేయలేదంటూ మడకశిర మార్కెట్ యార్డ్ చైర్మన్ బీఎస్ గురుమూర్తి అధికారుల మధ్య వేసిన చైర్లను చెప్పు కాళ్లలో తన్నారు. వేదికపై ఉన్న ఎంపీపీ సుమ, జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు, వైస్ ఎంపీపీలు లింగరాజు, సౌమ్య, ఎంపీటీసీ సభ్యులు దీన్ని తీవ్రంగా ఖండించారు. సభను అగౌర పరచడం ఏంటని టీడీపీ నాయకులు తీరును నిలదీశారు. అరగంట పాటు గురుమూర్తితో పాటు సింగిల్ విండో అధ్యక్షుడు దాసరెడ్డి కింద కూర్చొని మూడు గంటల పాటు సమావేశాన్ని అడ్డుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఎన్నికల్లో గెలుపొందిన వారిని మాత్రమే వేదికపై ఉన్న చైర్లలో కూర్చోవడానికి అనుమతి ఉందని అధికారులు టీడీపీ నాయకులకు చెప్పారు. ఆఖరికి టీడీపీ నాయకులు కూడా వేదికపై కూర్చోడానికి మండల పరిషత్ పాలక వర్గం అనుమతివ్వడంతో సమావేశాన్ని నిర్వహించారు.
తమవారికి చైర్లు వేయలేదని మండల మీట్‌లో టీడీపీ ప్రజాప్రతినిధుల రచ్చ


