చిలమత్తూరు: మహాకవి యోగి వేమనకు తీరని అవమానం జరిగింది. హిందూపురం పట్టణంలోని ఆయన విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు చీర కట్టి పూలు వేసి అవమానించారు. ఘటనపై రెడ్డి సంఘాలు భగ్గుమన్నాయి. మహాకవిని అవమానించడం సిగ్గుచేటని రెడ్డి జేఏసీ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌రెడ్డి పేర్కొన్నారు. వేమన విగ్రహానికి వేసిన చీరను తొలగించి క్షీరాభిషేకం చేశారు. ఇది పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మీడియా కోఆర్డినేటర్ ప్రణయ్‌రెడ్డి, సోషియల్ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, రెడ్డిసంఘం నాయకులు పరమేష్‌రెడ్డి, నంజుండరెడ్డి, శివారెడ్డి, వెంకట్రామిరెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
రైతు ఖాతా నుంచి రూ.లక్ష మాయం
ఉరవకొండ: తన ప్రమేయం లేకుండానే తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.లక్ష నగదు మాయమైందని ఉరవకొండ మండలం రాయంపల్లికి చెందిన రైతు జంగం రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై పోలీసులకు ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఇటీవల మిర్చి పంట విక్రయించడంతో రూ.14 లక్షలను వ్యాపారి తన బ్యాంక్ ఖాతాలోకి జమ చేశాడన్నారు. ఇందులో రూ.11 లక్షలను మూడు రోజుల క్రితం విత్‌డ్రా చేశానని, మిగిలిన రూ.3లక్షలను ఇంటి నిర్మాణం కోసం ఖాతాలోనే నిల్వ చేసినట్లు వివరించాడు. ఈ నెల 4న వరుసగా రూ.50వేలు, రూ.34వేలు, రూ.10వేలు, రూ.6వేలు చొప్పున నగదు మరో ఖాతాకు బదిలీ అయిందన్నారు. డబ్బు బదిలీ అయినట్లు తనకు ఎలాంటి మెసేజ్ కానీ, ఓటీపీ కాని రాలేదని, దీనిపై విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు బాధిత రైతు ఫిర్యాదు చేశాడు.
బాలుడి అప్పగింత
హిందూపురం: సడ్లపల్లిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన రామచంద్రారెడ్డి కుమారుడు 13ఏళ్ల ప్రజ్వల్‌రెడ్డిని తల్లిదండ్రుల వద్దకు పోలీసులు సురక్షితంగా చేర్చారు. తరచూ సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుతుండడంతో మంగళవారం తండ్రి మందలించాడు. దీంతో బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రెండో పట్టణ సీఐ అబ్దుల్ కరీం నేతృత్వంలో బృందాలుగా విడిపోయిన పోలీసులు పట్టణ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. సాయంత్రం రైల్వేస్టేషన్ పరిసరాల్లో కనిపించడంతో వెంటనే పీఎస్‌కు పిలుచుకెళ్లారు. కౌన్సెలింగ్ అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు.
చైన్ స్నాచర్‌కు దేహశుద్ధి
శింగనమల(నార్పల): మండల కేంద్రం నార్పలలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయిస్తున్న వ్యక్తిని ప్రజలు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నార్పలలోని సుల్తాన్‌పేటలో నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొనేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో స్థానికులు అప్రమత్తమై దుండగుడిని వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
యశవంతపుర (బెంగళూరు): ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను మంగళవారం బెంగళూరులోని హెబ్బగోడి పోలీసులు అరెస్ట్ చేసి రూ.41.67 లక్షల విలువైన 51 వాహనాలను సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో అనంతపురం జిల్లాకు చెందిన చిత్తప్పగారి ఆనంద్, నంద్యాలకు చెందిన షేక్ షఫీర్ బాషా ఉన్నారు. వీరి నుంచి 501 నకిలీ ఆర్‌సీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బెంగళూరులో పలుచోట్ల బైక్‌లు చోరీ అయినట్లు ఫిర్యాదులు అందాయని, ఈ క్రమంలో హెబ్బగోడి పోలీసులు గత నెల 5న ఓ నిందితుడిని పట్టుకుని విచారించగా ముఠా గుట్టు రట్టయిందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెంట్ సాయంతో ఇంటర్నెట్ సెంటర్‌లో డూప్లికేట్ ఆర్‌సీ కార్డులను రూపొందిస్తున్నట్లు విచారణలో వెల్లడయిందన్నారు. ఫేస్‌బుక్‌లో ప్రకటనలిచ్చి చోరీ వాహనాలను అసలుగా నమ్మించి అమ్ముతున్నట్లు నిందితులు అంగీకరించారన్నారు.


