విద్యుదాఘాతం విద్యార్థి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతం విద్యార్థి మృతి

May 6 2026 8:55 AM | Updated on May 6 2026 8:55 AM

రాప్తాడు రూరల్‌: ఓవైపు చదువుకుంటూ మరోవైపు కుటుంబానికి అండగా ఉంటున్న విద్యార్థిని కరెంటు రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ఘటన మంగళవారం రాప్తాడు మండల పరిధిలోని చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...అనంతపురం రూరల్‌ జాకీర్‌కొట్టాలుకు చెందిన రితేష్‌ఖాన్‌ కుమారుడు అజాంఖాన్‌ (20) ప్రభుత్వ ఐటీఐలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఖాళీ సమయంలో టైల్స్‌ పనికి వెళ్లేవాడు. మంగళవారం రాప్తాడు మండలం కళాకారుల కాలనీలో టైల్స్‌ పనులు చేస్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్‌ వైర్‌ తొక్కడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తోటి కార్మికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించినా... ఫలితం లేకపోయింది. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చదువుకుంటూనే కుటుంబానికి అండగా ఉంటున్న అజాంఖాన్‌ దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న రాప్తాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చాపట్లలో కౌలు రైతు ఆత్మహత్య

రాప్తాడు రూరల్‌: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన మేరకు.. కణేకల్లు ప్రాంతానికి చెందిన తలారి నరసింహులు (41) రాప్తాడు మండలం చాపట్లలో వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. కొన్నేళ్లుగా మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఏడాది టమాట, వేరుశనగ పంటలు సాగు చేసినా... ఆశించిన దిగుబడి రాకపోవడం కుదేలయ్యాడు. పంటల కోసం చేసిన అప్పులకు వడ్డీల భారం పెరుగుతుండగా తీర్చే మార్గం కానరాక మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం తన పొలం వద్దే పంటకు వినియోగించే మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబానికి అండగా ఉన్న నరసింహులు మరణించడం వారిని పూర్తిగా కుదేలు చేసింది. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా మృతుడి బంధువులు రాత్రి రాప్తాడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.

కార్మికులకు వేతనాలు చెల్లించాలి

ముదిగుబ్బ: సత్యసాయి తాగునీటి పథకంలో భాగంగా పనిచేస్తున్న కార్మికులకు బకాయివేతనాలను తక్షణమే చెల్లించాలని సీపీఐ నాయకుడు శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. మంగళవారం నుంచి వేతనాల కోసం సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీపీఐ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి కార్మికులకు సంఘీభావం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement