● ఇంటి తాళం బద్ధలుగొట్టి 15 తులాల బంగారు నగల అపహరణ
కళ్యాణదుర్గం రూరల్: స్థానిక మున్సిపాలిటీ పరిఽధిలోని ఒంటిమిద్ది గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఒంటిమిద్దిలో నివాసముంటున్న దంపతులు రామాంజనేయులు, గీతమ్మ వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. ఇటీవల రామాంజనేయులు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే రోజూ ఇంటికి తాళం వేసి సమీపంలోని బంధువుల ఇంటి ఆవరణలో నిద్రించేవారు. సోమవారం బంధువుల ఇంటి వద్దకు దంపతులు వెళ్లిన సమయంలో ఇంటి తాళాన్ని దుండగులు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని 15తులాల బంగారు నగలు, రూ.6వేలు నగదు అపహరించారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్న రామాంజనేయులు దంపతులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి నిందితుల వేలి ముద్రలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ హరినాథ్ తెలిపారు.
రైలు కింద పడి యువకుడి మృతి
గుంతకల్లుటౌన్: స్థానిక హనుమాన్ జంక్షన్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్ గోపాల్ కుమారుడు కె.బాలచంద్ర (34)గా గుర్తించారు. గుంతకల్లులోని కొనకొండ్ల రైల్వేగేట్ సమీపంలో ఉన్న ఆర్డీటీ బిల్డింగ్స్‌లో అద్దెకుంటున్నాడు. అవివాహితుడు. ఆర్టీసీ అద్దె బస్సుల్లో క్లీనర్‌గా దినసరి కూలి పనితో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం వేకువజామున రైలుకింద పడి మృతి చెందాడు. కాగా, మద్యం మత్తులో రైలు కిందపడ్డాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఉత్సాహంగా గ్రామీణ క్రీడా పోటీలు
ఆత్మకూరు: మండలంలోని ముట్టాల, పాపంపల్లి గ్రామాలకు సంబంధించిన అక్కమ్మగార్ల పరుష ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పరుష కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అక్కమ్మ గార్లకు పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సాహంగా రాతి దూలం లాగుడు, ఇరుసు ఎత్తే పోటీలను నిర్వహించారు.


