పుట్టపర్తి అర్బన్: పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన బాల సదనాల విద్యార్థులను కలెక్టర్ శ్యాం ప్రసాద్ సోమవారం అభినందించారు. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు ఎన్నో కష్టాలకోర్చి ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రశంసిస్తూ వారికి బహుమతులు అందజేసి సత్కరించారు. పిల్లలకు మెరుగైన వసతులు కల్పిస్తున్న సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ (హిందూపురం), హ్యాపీ హోం స్టే (పుట్టపర్తి), ఆర్డీటీ, ఆర్‌జీటీ సంస్థల నిర్వాహకులకు కూడా సత్కరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ప్రమీల, బాలల సంరక్షణ అధికారి మహేష్, ప్రొటెక్షన్ ఆఫీసర్లు మురళీధర్, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇంటి పన్నుపై
5 శాతం రాయితీ
ప్రశాంతి నిలయం: ఇంటి పన్నును సకాలంలో చెల్లించే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 5 శాతం రాయితీని ప్రభుత్వం కల్పిస్తోందని కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో ‘ఇంటిపన్ను రాయితీ’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మే 31వ తేదీలోపు పన్ను చెల్లించిన వారికి రాయితీ వర్తిస్తుందన్నారు. పాత బకాయిలకు గానీ, యూజర్ ఛార్జీలకు గానీ రాయితీ వర్తించబోదన్నారు.
‘పోలీసు పరిష్కార వేదిక’కు 83 అర్జీలు
పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’కు 83 అర్జీలు అందాయి. ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. దివ్యాంగుల వద్దకు ఆయనే వెళ్లి వారి సమస్య తెలుసుకున్నారు. అప్పటికప్పుడు సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడారు. దివ్యాంగులు, మహిళలు ఇచ్చే అర్జీలను తక్షణం పరిష్కరించాలన్నారు. సమస్య తీవ్రతను తెలుసుకొని చట్టపరిధిలో విచారించి పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, సీఐలు బొజ్జప్ప, లక్ష్మీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.


