15న మంత్రి లోకేష్‌ ఇల్లు ముట్టడి | - | Sakshi
Sakshi News home page

15న మంత్రి లోకేష్‌ ఇల్లు ముట్టడి

May 5 2026 7:02 AM | Updated on May 5 2026 7:02 AM

పుట్టపర్తి: విద్యాశాఖలో పని చేస్తున్న ‘సమగ్ర’ ఉద్యోగులు పోరుబాట పట్టారు. పాదయాత్రగా వెళ్లి ఈనెల 15వ తేదీన విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ఇంటిని ముట్టడించనున్నారు. ఈ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి సోమవారం డీఈఓ కిష్టప్పకు నోటీసులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సమగ్రశిక్షలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, అకౌంటెంట్లు, మెసెంజర్లు, ఐఈఆర్పీలు, రిజర్వ్‌ మొబైల్‌ టీచర్లు, ఫిజియోథెరపిస్ట్‌లు, ఆయాలు, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు తదితర 18 విభాగాల వారు 21 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారన్నారు. అందరూ చాలీ చాలని జీతాలతో అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లవుతున్నా రూపాయి జీతం పెంచలేదన్నారు. ఏ సమస్యా పరిష్కరించలేదన్నారు. విద్యాశాఖకు లోకేష్‌ మంత్రిగా ఉన్నా... తమకు న్యాయం చేయక పోవడం బాధాకరమన్నారు. ఇందుకు నిరసనగా ఉద్యోగులు, కుటుంబ సభ్యులతో కలసి మంత్రి లోకేష్‌ ఇంటికి పాదయాత్రగా వెళ్లి ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో ‘సమగ్ర’ ఉద్యోగుల జేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఓబులేసు, నాయకులు శ్రీరాములు, పోతులయ్య, శ్రీనివాసులు, రామ్మోహన్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సమగ్ర ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవీ...

● సమగ్ర శిక్షలో పని చేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చేయాలి.

● అందరికీ వేతనాలు వెంటనే ఇవ్వాలి. హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలి. మినిమం టైం స్కేల్‌, హెచ్‌ఆర్‌ఏ, డీఏ అమలు చేయాలి.

● పదవీ విరమణ ప్రయోజనాల కింద రూ.10 లక్షలు గ్రాట్యుటీ కల్పించాలి. సామాజిక భద్రతా పథకాలు, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ, అమలు చేయాలి.

● పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి. వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు మంజూరు చేయాలి. మెరుగైన హెల్త్‌ స్కీం అమలు చేయాలి. ఎక్స్‌గ్రేషియా రూ.20 లక్షలకు పెంచాలి. మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి. కారుణ్య నియామకాలు చేపట్టాలి.

డీఈఓకు నోటీసులు అందజేసిన ‘సమగ్ర’ ఉద్యోగుల జేఏసీ

Advertisement
 
Advertisement
Advertisement