విశిష్ట సంప్రదాయం.. శ్రీవారి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

విశిష్ట సంప్రదాయం.. శ్రీవారి కల్యాణం

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

రాయదుర్గంటౌన్‌: పట్టణంలోని కోట ప్రాంతంలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయంలో శ్రీవారి కల్యాణోత్సవం విశిష్ట సంప్రదాయంగా అనాదిగా కొనసాగుతోంది. ఈ నెల 10 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్య ఘట్టమైన శ్రీవారి కల్యాణోత్సవం ఈ నెల 5న జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తరాలుగా కొనసాగుతున్న వివాహ ఆచారానికి మంగళవారం ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయం వేదిక కానుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 8 లేదా 9 ఏళ్ల ఓ బాలికతో శ్రీవారి వివాహం జరిపించడం ఇక్కడ ఆచారం. నిశ్చితార్థం మొదలుకొని కల్యాణం వరకూ అన్ని బ్రాహ్మణ పండితులు, పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగే వివాహ తంతు, బాలికతో శ్రీవారికి వివాహం జరిపించాలనే ఆలోచన, ఆచారం దాదాపు వందేళ్ల క్రితం నుంచి పద్మశాలీయ వంశస్తుల ద్వారా కొనసాగుతూ వస్తోంది. ఏటా శ్రీవారితో పద్మశాలీయ వంశం అరవ తెగకు చెందిన బాలికతో వివాహం జరిపించడం ఆన వాయితీ.

5న బాలికతో శ్రీవారి కల్యాణ ఘట్టం..

ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 5న ఉదయం 11.30 గంటలకు అభిజిన్‌ లగ్నంలో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఏడాది పద్మశాలీయ వంశం అరవ తెగకు చెందిన అరవా నాగేష్‌, పావని దంపతుల కుమార్తె శ్రీస్వర జాహ్నవి అనే బాలికతో శ్రీవారి వివాహం జరిపించనున్నారు. పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, ఆలయ పాలక కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు మేళతాళాలతో పెళ్లి కూతురు పద్మావతిని (జాహ్నవి) ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొస్తారు. అక్కడి నుంచి పెళ్లి కూతురిని అలంకరించి, కోటలోని శ్రీవారి సన్నిధికి తీసుకొచ్చి పురోహితులు, వేదపండితుల ఆధ్వర్యంలో వివాహం జరిపిస్తారు.

తొమ్మిదేళ్ల బాలికతో

రేపు శ్రీవారి వివాహ ఘట్టం

కల్యాణోత్సవానికి పూర్తయిన ఏర్పాట్లు

Advertisement
 
Advertisement
Advertisement