కదిరి: సూర్యుడు సెగలు కక్కుతుండగా...జనం విలవిల్లాడిపోతున్నారు. ఏప్రిల్ చివరి వారం నుంచి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 43 డిగ్రీల మార్కును దాటడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఈ వేసవిలో వడదెబ్బ సోకి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆరుగురు మృతి చెందారు. రానున్న రోజుల్లోనూ ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ప్రధాన రోడ్లన్నీ ఖాళీ..
ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి వేడిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి హడలి పోతున్నారు. దీంతో ఆ సమయంలో జిల్లాలోని అన్ని ప్రధాన పట్టణాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనపడుతున్నాయి. రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈసారి ఎండలు ఎక్కువే..
గత ఏడాది మే 2వ తేదీన జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలుగా నమోదైంది. ఈసారి అదే రోజు గతంతో పోలిస్తే మరో 5 డిగ్రీలు పెరిగింది. శనివారం కదిరిలో 43.4 డిగ్రీలు, ధర్మవరంలో 42.1 డిగ్రీలు, పెనుకొండ 41.3, హిందూపురం 41.2, పుట్టపర్తి 41.8, మడకశిర 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఎవరి నోట విన్నా ఎండల మాటే వినపడుతోంది.
అకాల వర్షాలు..
ఈసారి వేసవిలో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఎండల తీవ్రత ఒకవైపు ఉంటే.. మరోవైపు జిల్లాలో అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు వీస్తున్నాయి. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. పుట్టపర్తిలోని ఎనుములపల్లిలో నారపరెడ్డి అనే రైతు ఇంటి సమీపంలో ఉన్న కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది. గోరంట్ల మండలంలో శుక్రవారం అత్యధికంగా 120.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ధర్మవరం మండలం ఆకుతోటపల్లిలో మురళీమోహన్‌రెడ్డికి చెందిన సుమారు 2,500 అరటిచెట్లు గాలి, వానకు నేలకొరిగాయి.
రోజురోజుకూ పెరుగుతున్న
ఎండల తీవ్రత
43 డిగ్రీల మార్కును దాటిన
గరిష్ట ఉష్ణోగ్రత
జిల్లాలో అక్కడక్కడా అకాల వర్షాలు
విచిత్ర వాతావరణంతో
జనం ఉక్కిరి బిక్కిరి


