వేపకుంటలో పచ్చ రౌడీయిజం | - | Sakshi
Sakshi News home page

వేపకుంటలో పచ్చ రౌడీయిజం

May 3 2026 10:10 AM | Updated on May 3 2026 10:10 AM

కనగానపల్లి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతే లేకుండా పోయింది. అధికారం అండతో రెచ్చిపోతున్న పచ్చమూకలు భౌతికదాడులకూ పాల్పడుతున్నాయి. తాజాగా మండలంలోని వేపకుంట గ్రామంలో స్థానిక టీడీపీ నేతలు రౌడీయిజం చేశారు. శుక్రవారం రాత్రి గ్రామంలోని వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడి, ముగ్గురిని గాయపరిచారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. వేపకుంట గ్రామంలో వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేసే స్థలంపై చాలా రోజులుగా వివాదం నడుస్తోంది. రాజకీయ దురుద్దేశంతో గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు పోతిరెడ్డి, శ్రీరామరెడ్డి ఇళ్ల ముందు ప్రధాన రహదారి పక్కనే విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నారు. దీంతో గ్రామస్తులతో కలసి వైఎస్సార్‌సీపీ నాయకులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అయినా గ్రామంలో తమ మాటనే నెగ్గాలన్న ఉద్దేశంతో టీడీపీ నేతలు రాత్రికి రాత్రే విగ్రహాన్ని తీసుకొచ్చి వివాదాస్పద స్థలంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో వారిని అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి చేయటంతో పాటు అక్కడున్న గుడ్డం రామలింగారెడ్డి, గంగుల లింగారెడ్డి, నాగసుధపై టీడీపీ నాయకులు తలారి రమేష్‌, సురేష్‌, అనిల్‌, లింగన్న, చండ్రాయుడు, గోపాల్‌తో పాటు 20 మంది కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. తర్వాత వారంతా గ్రామంలో కేకలు వేసుకుంటూ అరగంట పాటు అలజడి సృష్టించి వివాదాస్పద స్థలంలో విగ్రహాన్ని పెట్టారు. గ్రామంలో ఇంత జరుగుతున్నా పోలీసులు ఏమీ తెలియనట్లు ఆలస్యంగా అక్కడి చేరుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గాయపడ్డ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ముగ్గురినీ వారి కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి ఘటనపై పోలీసులు ఇంతవరకు ఎవరిపైనా కేసు నమోదు చేయలేదు. గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేసినట్లు కనగానపల్లి ఎస్‌ఐ ఎం.రిజ్వాన్‌ తెలిపారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లపై టీడీపీ నేతల దాడి

గ్రామంలో వాల్మీకి విగ్రహ ఏర్పాటు స్థలంపై వివాదం

కోర్టు ఆదేశాలు ధిక్కరించి రాత్రి పూట విగ్రహం ఏర్పాటు

అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ మూకల దాడి

ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు

సంఘటనపై స్పందించని పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement