మాతాశిశు మరణాలు నివారించాలి | - | Sakshi
Sakshi News home page

మాతాశిశు మరణాలు నివారించాలి

May 3 2026 10:10 AM | Updated on May 3 2026 10:10 AM

ప్రశాంతి నిలయం: జిల్లాలో మాతా, శిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఆదేశించారు. శనివారం ఆయన... కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో మాతా శిశు మరణాలపై సమీక్షించారు. గర్భిణుల్లో రక్త హీనత, అధిక బరువు, ఆరోగ్య సమస్యలను మొదటి త్రైమాసికంలోనే గుర్తించి తగిన చికిత్స అందించాలన్నారు. రక్త హీనత ఉన్న గర్భిణులకు ఐరన్‌ సుక్రోజ్‌ ఇంజెక్షన్లు ఇవ్వాలన్నారు. హైరిస్క్‌ కేసులను ప్రసవానికి వారం ముందే పెద్దాసుపత్రుల్లో చేర్చాలన్నారు. సమీక్షలో డీఎంహెచ్‌ఓ ఫైరోజా బేగం, డీఐఓ నాగేంద్రనాయక్‌ పాల్గొన్నారు.

ఉత్తమ వైద్య సేవలకు ఎన్‌క్యూఎస్‌ గుర్తింపు..

జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ముందున్న 20 ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరం ఉపకేంద్రాలకు కేంద్రం జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల (ఎన్‌క్యూఎస్‌) అవార్డుల ప్రకటించింది. శనివారం కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఆ అవార్డులను ఉపకేంద్రాల సిబ్బందికి ప్రదానం చేశారు.

‘ఉపాధి’ పనుల తనిఖీ..

పెనుకొండ రూరల్‌: ‘జలధార – జలహారతి’ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఉదయం పెనుకొండ వైపు వెళ్తున్న కలెక్టర్‌... మార్గమధ్యంలో రాంపురం పంచాయతీ శివారులో ఉపాధి హామీ కింద మరువపల్లి చెరువు నుంచి చెర్లోపల్లి చెరువుకు నీరందించేందుకు ఉపాధి హామీ కింద చేపట్టిన కాల్వ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ స్వాతి, ఎంపీడీఓ ఉమాదేవి, ఏపీఓ సంజీవ రెడ్డి ఉన్నారు.

చైన్‌ స్నాచర్‌.. విద్యుత్‌ ఉద్యోగి

మహిళ మెడలోని గోల్డ్‌ చైన్‌ అపహరణ..అరెస్టు

కదిరి టౌన్‌: అతను విద్యుత్‌ శాఖలో ఉద్యోగి.. జీతం సరిపోలేదో...లేక వ్యసనాలకు బానిసయ్యాడో గానీ చోరీల బాట పట్టాడు. ఓ మహిళ మెడలోని బంగారు చైను లాక్కెళ్లి కటకటాల పాలయ్యాడు. ఈ కేసు వివరాలను కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి పట్టణ పోలీసుస్టేషన్‌లో విలేకరులకు తెలిపారు.

దొంగను పట్టించిన సీసీ కెమెరాలు..

కదిరి ఏపీఎస్పీడీసీఎల్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసే భూక్యా రమేష్‌నాయక్‌ చెడు వ్యసనాలకులోనయ్యాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీల బాట పట్టాడు. ఏప్రిల్‌ 28న ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగించే మగ్గాల క్వార్టర్స్‌కు చెందిన పైపల్లి శాంతి హిందూపురం రోడ్డులో నడుచుకుంటూ వెళ్తుండగా.. స్కూటీపై వెళ్లి ఆమె మెడలోని రూ.2 లక్షల విలువైన (2 తులాలు) బంగారు తాళిబొట్టు గొలుసు లాక్కొని పారిపోయాడు. బాధితురాలు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా భూక్యా రమేష్‌ నాయక్‌ను శనివారం అరెస్టు చేసి అతడి నుంచి 2 తులాల బంగారు తాళి బొట్టు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement