పుట్టపర్తి టౌన్: రీల్స్ రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పబ్లిసిటీ పొందాలన్న పిచ్చిలో ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఈ సంఘటన కొత్తచెరువు మండలం పోతులకుంట గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తచెరువు మండలం పోతులకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులు కుమారుడు శివకుమార్ ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. తరచూ రీల్స్ చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి ఆనందపడేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి తన స్నేహితులతో కలిసి పోతులకుంటలోని పాత సచివాలయం వద్ద రీల్స్ చిత్రీకరిస్తుండగా... పెట్రోల్ ఒక్కసారిగా మీద పడి మంటలు చెలరేగాయి. స్నేహితులు అప్రమత్తమై వెంటనే షర్టు తీసేయడంతో యువకుడికి పెను ప్రమాదం తప్పింది. అనంతరం శివకుమార్‌ను హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టంట్లు చేయడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన గుర్తు చేసింది.


