ధర్మవరం రూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి అపార నష్టం జరిగింది. మామిడి, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. ధర్మవరం మండల పరిధిలోని ఆకుతోటపల్లిలో రైతు మురళీమోహన్‌రెడ్డి మూడు ఎకరాల్లో సాగు చేసిన అరటి తోట నేలకొరిగింది. పంట చేతికొచ్చే సమయంలో సుమారు 2500 దాకా అరటి చెట్లు నేలకొరిగాయాని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.3 లక్షల దాకా నష్టం వాటిల్లిందన్నారు.
ఎన్‌పీకుంట: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో గాలి, వాన బీభత్సం సృష్టించింది. మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గెంగినాయునిపల్లి, నేరెడుచెరువు గ్రామాల్లో ఇంటి పైకప్పులకు వేసిన రేకులు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.
మొక్కజొన్నకు నష్టం
తనకల్లు: మండలంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి టీ. సదుంలో మొక్కజొన్న పంట నేలకొరిగింది. శంకర, అంజినప్ప మూడు ఎకరాల చొప్పున ఆరు ఎకరాలలో మొక్కజొన్న దెబ్బతింది. పంట బాగుండటంతో లాభం వస్తుందనుకున్న సమయంలో రూ.2 లక్షల దాకా నష్టపోయామని బాధితులు వాపోయారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి.
నేలరాలిన మామిడి
కనగానపల్లి: మండలంలో పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి కురిసిన మోస్తరు వర్షానికి పంట నష్టం జరిగింది. గాలీవానతో కనగానపల్లి, రాంపురం గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలడంతో రైతులు నష్టపోయారు. కనగానపల్లిలోని రైతు లక్ష్మీనారాయణకు చెందిన నాలుగు ఎకరాల మామిడి తోటలో కాయలు రాలిపోవడంతో రూ.లక్ష నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయారు.
పుట్టపర్తి టౌన్: పట్టణంలో గురువారం అర్ధరాత్రి భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. దంచికొట్టిన వానకు రహదారులు వాగులను తలపించాయి. వర్షం కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పుట్టపర్తి సమీపంలో ఎనుములపల్లిలో నారపరెడ్డి ఇంటి వెనుక భాగాన కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది.
30 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని 30 మండలాల్లో గురువారం రాత్రి వర్షం కురిసింది. జిల్లా మొత్తం 512.8 ఎంఎం వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. గోరంట్ల మండలంలో అత్యధికంగా 120.4 ఎంఎం, రొద్దం 48.2, కనగానపల్లి 41.8,అమడగూరు 23.2, రామగిరిలో 20.6, సోమందేపల్లిలో 20.6 ఎంఎం వర్షం కురిసింది. పెనుకొండ 19.2, నల్లమాడలో 19, పరిగిలో 18.4, చిలమత్తూరులో 16.4, సీకేపల్లిలో 15.2 వర్షం పడింది.


