హిందూపురం టౌన్: శవాలపై పడిన చిల్లర ఏరుకోవడం అనేది పాత సామెత, కానీ శవాల్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా దోపిడీ చేయడం అనేది కొత్త నానుడి. సీఎం చంద్రబాబు బామ్మర్ది బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలోని జిల్లాస్పత్రిలో ఈ దందా వెలుగు చూసింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... గురువారం మధ్యాహ్నం హిందూపురంలోని చౌడేశ్వరీ కాలనీ సమీపంలో ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో రామాంజి (40) అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వెంటనే స్థానిక జిల్లాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అయితే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అప్పగించడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో మృతుడి కుటుంబసభ్యులు, బంధులు తీవ్ర ఆగ్రహానికి లోనై ఆందోళనకు దిగారు. ఆ సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని శుక్రవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహం అప్పగిస్తారని పేర్కొనడంతో శాంతించారు. అయితే శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు ఒకరి మీద ఒకరు చెబుతూ పోస్టుమార్టం నిర్వహించడంలో తీవ్ర ఆలస్యం చేశారు. కేసు నమోదు కాలేదని ఒకసారి, ఉత్తర్వులు అందినప్పుడు చేస్తామని మరోసారి చెబుతుఊ కాలయాపన చేశారు. ఈ నేపథ్యంలో మృతదేహం డీకంపోస్ట్ అవుతూ దుర్వాసన వెదజల్లుతుండడంతో చివరకు పోస్టుమార్టం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో మృతుడి సంబంధీకుల వద్ద నుంచి రూ.3,800 నగదు తీసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించాలంటే రూ.500 ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. కూలి పనులతో జీవనం సాగిస్తున్న తమ వద్ద అంత్యక్రియలకు సంబంధించిన డబ్బు తప్ప మరేమీ లేదని తెలిపినా వినలేదు. చివరకు రూ.500 చెల్లించడంతో మృతదేహాన్ని అప్పగించారని బంధువులు తెలిపారు.
ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య
మృతుడి బంధువుల అభ్యర్థన మేరకు మృతదేహాన్ని శుభ్రం చేయడం, దుర్వాసన వెదజల్లకుండా సెంట్ చల్లడం, ప్యాకింగ్‌కు అవసరమైన సామగ్రి కోసం సంబంధీకుల వద్ద నుంచి డబ్బు తీసుకోవడం పరిపాటిగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యే ఉంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ ఇవ్వడం లేదు. అయినా ఈ విషయంపై పూర్తి విచారణ చేపట్టాం. – డాక్టర్ జనార్దన్,
సూపరింటెండెంట్, జిల్లాస్పత్రి, హిందూపురం
ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో అమానుషం
మార్చురీ వద్ద దందాపై మృతుడి కుటుంబ సభ్యుల ఆవేదన
హిందూపురం ఆస్పత్రి సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు


