పుట్టపర్తిటౌన్: సత్యసాయి గిరి రథోత్సవం శుక్రవారం పట్టణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజు గిరి రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ప్రశాంతి నిలయం ముఖద్వారం వద్ద అలకరించిన రథంలో సత్యసాయి చిత్రపటాన్ని ఉంచి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథాన్ని విద్యాగిరి, గోకులం, ఎనుములపల్లి, గణేష్ కూడలి, ెపెట్రోల్ బంక్, చింతతోపులు, శివాలయం వీధి, గోవిందయ్యపేట, పెద్దబజార్ మీదుగా ఊరేగింపుగా ప్రశాంతి నిలయానికి చేర్చారు. అనంతరం మహా మంగళ హారతులతో ముగించారు. ఈ ఉత్సవంలో దేశ, విదేశీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
‘మగువ మహోన్నతి’
పోస్టర్ల ఆవిష్కరణ
ప్రశాంతినిలయం: ‘స్పార్క్ 8.0 –మగువ మహోన్నతి’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను శుక్రవారం కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో జేసీ మౌర్య భరద్వాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్, అనంతపురం స్పోక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. మహిళల జీవనోపాధి, పారిశ్రామిక నైపుణ్యాల అభివృద్ధిని లక్ష్యంగా తీసుకొని కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. 8 నుంచి జూన్ 8వ తేదీ వరకూ రోజూఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హిందూపురంలోని సంఘమిత్ర మండల సమాఖ్య సమావేశ మందిరం, డ్వామా ప్రాంగణంలో కార్యక్రమం ఉంటుందన్నారు. నెట్‌వర్క్‌ల అభివృద్ధి, మార్కెట్ అవకాశాల విస్తరణ, స్టార్టప్స్‌కు మద్దతు, మహిళల ఆర్థిక సాధికారత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి హరికృష్ణ, హబ్ ప్రతినిధులు సమీరా పరమేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు న్యాయం చేయాలి : ఎస్పీ సతీష్
ధర్మవరం అర్బన్: పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ సతీష్‌కుమార్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు పరిశీలించారు. స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులు, నమోదు అవుతున్న కేసుల సంఖ్య, సీసీ కెమెరాల పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, బాధితులకు తక్షణ న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నేరాల నివారణకు విజిబుల్ పోలీసింగ్ పెంచాలన్నారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించి ఫిర్యాదులను స్వీకరించి చర్యలు తీసుకోవాలన్నారు. వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, ఎస్‌ఐ ఉమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.


