తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకే హత్య | - | Sakshi
Sakshi News home page

తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకే హత్య

May 2 2026 11:43 AM | Updated on May 2 2026 11:43 AM

ముగ్గురు నిందితుల అరెస్టు

ధర్మవరం అర్బన్‌: ఇచ్చిన డబ్బు వెనక్కి అడిగినందుకు వ్యక్తిని హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు టూటౌన్‌ సీఐ రెడ్డెప్ప తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చూపారు. టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రెడ్డెప్ప మాట్లాడారు. మదనపల్లికి చెందిన పూల రమణారెడ్డి నాలుగేళ్ల క్రితం ధర్మవరం గాంధీనగర్‌కు చెందిన మాయకుంట్ల చక్రధర్‌ అలియాస్‌ చక్రికి రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కొన్ని సంవత్సరాల అనంతరం తిరిగి రూ.లక్ష రమణారెడ్డికి ఇచ్చాడు. మిగిలిన రూ.3 లక్షలు ఇవ్వాలని చక్రధర్‌ను పలుమార్లు రమణారెడ్డి డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో లక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవానికి ధర్మవరానికి వచ్చిన రమణారెడ్డి తన డబ్బులు రూ.3 లక్షలు ఇవ్వాలంటూ ఫోన్‌ చేసి అడిగాడు. దీంతో ధర్మవరంలో ఉన్న రమణారెడ్డిని చక్రధర్‌, అతని స్నేహితులు సింగెటి రాజు, నీలూరి రమేష్‌లతో కలిసి గతనెల 29న అర్ధరాత్రి మార్కెట్‌యార్డు సమీపంలోని ఎస్‌ఆర్‌ కార్‌ వాషింగ్‌ షెడ్‌కు తీసుకెళ్లారు. ‘రూ.మూడు లక్షల అప్పు కోసం నాకే ఫోన్‌ చేసి అడుగుతావా, నిన్ను చంపి మీ ఇంటి వద్దనే పారేస్తాం. ఎవడు అడ్డు వస్తాడో చూస్తాం’ అని రమణారెడ్డిని ఇనుపు పైపు, కట్టెలతో విచక్షణ రహితంగా కొట్టి అతని బంధువుల ఇంటి వద్ద గత నెల 30న తెల్లవారుజామున పడేసి వెళ్లిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ఏమైందని రమణారెడ్డిని విచారించగా జరిగిన విషయం చెప్పాడు. అనంతరం రమణారెడ్డిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తుండగా గూడ్స్‌షెడ్‌ కొట్టాలలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో ఉన్నారన్న సమాచారంతో శుక్రవారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement