హిందూపురం: గమ్యస్థానానికి చేరుస్తామంటూ ఓ ప్రయాణికురాలి మెడలోని బంగారు గొలుసును ఆటో డ్రైవర్ అపహరించుకెళ్లిన ఘటన హిందూపురంలో సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన మేరకు.. హిందూపురానికి చెందిన రాజేశ్వరమ్మకు సోమందేపల్లి మండలం నడింపల్లి వద్ద తోట ఉంది. రోజూ ఆటోలో తోట వద్దకెళ్లి వచ్చేది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తన తోట వెళ్లేందుకు సిద్ధమైన రాజేశ్వరమ్మ స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుని ఆటో కోసం వేచి చూస్తుండగా ఓ డ్రైవర్ తన ఆటోను ఆపి సోమందేపల్లికి వెళుతున్నట్లు తెలిపాడు. అయితే ఆటోలో ఓ ప్రయాణికురాలు ఉండడంతో రాజేశ్వరమ్మ ధైర్యం చేసి ఎక్కింది. కేతగాని చెరువుకట్ట వద్దకు చేరుకోగానే నిర్మానుష్య ప్రాంతంలో ఆటోను డ్రైవర్ ఆపేశాడు. అనంతరం ప్రయాణికురాలిగా ఉన్న తన భార్యతో కలిసి రాజేశ్వరమ్మను బెదిరించి ఆమె మెడలోని 5 తులాల బంగారు నగను అపహరించి, ఆటో నుంచి తోసేసి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఆటో ప్రయాణించిన మార్గంలోని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.


