ఉచితం కాదు.. ఉపకార వేతనం | - | Sakshi
Sakshi News home page

ఉచితం కాదు.. ఉపకార వేతనం

May 2 2026 11:43 AM | Updated on May 2 2026 11:43 AM

అనంతపురం: కరువుసీమలో కల్పతరువుగా భాసిల్లుతున్న ఆర్డీటీ.. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రతిభావంతులైన విద్యార్థులకు దన్నుగా నిలిచే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పదో తరగతిలో మంచి మార్కులతో సత్తా చాటిన వారికి గతంలో ఆర్డీటీ సెట్‌ నిర్వహించి.. ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ఆరేళ్ల పాటు ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తూ వచ్చింది. తాజాగా వీటిని మరింత విస్త్ర ృత పరుస్తూ.. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు తీపి కబురు అందించింది. అన్ని సామాజిక వర్గాల వారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం జారీ చేసింది.

అర్హులు ఎవరంటే

● ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి (స్టేట్‌ సిలబస్‌ విధానం) 520 ఆపై మార్కులు, సీబీఎస్‌ఈ సిలబస్‌ విధానంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 430/500 సాధించి ఉండాలి. వీరు స్పెషల్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాం, సెమీ స్కాలర్‌షిప్‌కు అర్హులు.

● పదో తరగతిలో స్టేట్‌ సిలబస్‌కు సంబంధించి ప్రైవేట్‌ పాఠశాలలో చదివిన విద్యార్థులు 550 ఆపై మార్కులు, సీబీఎస్‌ఈ సిలబస్‌ విధానంలో 450/500 ఆపై మార్కులు సాధించి ఉండాలి. వీరు సెమీ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రాంకు అర్హులు.

● ఆర్డీటీ ప్రాజెక్ట్‌ ప్రాంతాల్లో నివసించే అన్ని కుటుంబాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

● సమాన మార్కులు వస్తే .. సైన్స్‌, మేథమేటిక్స్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

● కుటుంబ ఆర్థిక నేపథ్యాన్ని బట్టి ఎంపిక ఉంటుంది.

● ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్‌ సంస్థల్లో మంచి స్థాయిల్లో ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు అనర్హులు.

● నెలకు రూ.15 వేలు, ఆ లోపు వేతనం తీసుకుంటున్న చిరుద్యోగుల పిల్లలు మాత్రమే అర్హులు. వేతన ధృవీకరణ పత్రం సమర్పించాలి.

1,400 మందికి అవకాశం

స్పెషల్‌ స్కాలర్‌షిప్‌ కింద 400 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్‌, బీటెక్‌ వరకు (మొత్తం ఆరేళ్లు) కళాశాల ఫీజు, హాస్టల్‌ ఫీజు చెల్లిస్తారు. సెమీ స్కాలర్‌షిప్‌ కింద 1000 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్‌ కోర్సులో ఏడాదికి రూ.40 వేలు చొప్పున రెండేళ్లు పాటు చెల్లిస్తారు.

ఈ నెల 9 లోపు దరఖాస్తు చేసుకోవాలి

ఆర్డీటీ స్పెషల్‌ స్కాలర్‌షిప్‌, సెమీ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయడానికి ఈ నెల 9 వరకు అవకాశం ఉంది. పదో తరగతి హాల్‌టికెట్‌, పదో తరగతి మార్కుల జాబితా, విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్‌ కార్డు జిరాక్స్‌, ఇటీవల జారీ చేసిన రేషన్‌ కార్డు జిరాక్స్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (జిరాక్స్‌) అందజేయాలి. ఆయా ఆర్డీటీ ఏరియా కార్యాలయాల్లో సంప్రదించి.. దరఖాస్తులు అందజేయవచ్చు.

ఆర్డీటీ సెట్‌లో కీలక మార్పులు

స్పెషల్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపికై తే ఆరేళ్ల వరకు నేరుగా విద్యా సంస్థకు ఫీజు చెల్లింపు

సెమీ స్కాలర్‌షిప్‌కు ఎంపికై తే ఇంటర్మీడియట్‌ రెండేళ్లు ఏడాదికి రూ.40 వేల చొప్పున చెల్లింపు

అన్ని సామాజిక వర్గాల వారికీ అవకాశం

Advertisement
 
Advertisement
Advertisement