పేదల భూమి కబ్జాకు కూటమి నేతల యత్నం | - | Sakshi
Sakshi News home page

పేదల భూమి కబ్జాకు కూటమి నేతల యత్నం

May 2 2026 11:43 AM | Updated on May 2 2026 11:43 AM

అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

ముదిగుబ్బ: మండల కేంద్రం సమీపంలోని గుంజేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 75–1లో పేదలకు ఇంటి పట్టాల కోసం కేటాయించిన భూమిని శుక్రవారం ఉదయం కూటమి నాయకులు చదును చేయడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్సార్‌సీపీ నేత, మాజీ సర్పంచ్‌ శివశంకర్‌, నాయకులు పెద్ద వీరనారప్ప, నరసింహయ్య, ఓబులేసు, నారాయణస్వామితో పాటు మరికొందరు గ్రామస్తులు అక్కడకు చేరుకుని కూటమి నాయకులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శివశంకర్‌ మాట్లాడుతూ.. 2023లో గుంజేపల్లి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదల కోసం అప్పటి ప్రభుత్వం సర్వే నంబర్‌ 75–1లోని భూమిని కేటాయించిందని, దీంతో అప్పట్లో రూ. 2లక్షల ప్రభుత్వ నిధులతో ఆ ప్రాంతాన్ని చదును చేయించినట్లు గుర్తు చేశారు. అప్పటి తహసీల్ధార్‌ సహకారంతో 80 ప్లాట్లతో లేఅవుట్‌ను రూపొందించి రాళ్లను కూడా పాతించామన్నారు. గ్రామంలోని 80 మంది నిరుపేదలను గుర్తించి వారికి ప్లాట్లను కేటాయించి, వారి పేర్లతో జాబితాను సిద్ధం చేశారని, ఇంటి పట్టాలు పంపిణీ చేసే సమయానికి ఎన్నికల కోడ్‌ రావడంతో ఈ ప్రక్రియ కాస్త ఆగిపోయిందన్నారు. అయితే పేదల కోసం కేటాయించిన స్థలాన్ని కూటమి నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నించడం సిగ్గు చేటన్నారు. విషయాన్ని ఫోన్‌ ద్వారా చేరవేయడంతో తహసీల్దార్‌ అక్కడకు చేరుకుని పరిశీలించారన్నారు. వివాదానికి సంబంధించి విచారణ నిమిత్తం సరైన పత్రాలతో తహసీల్ధార్‌ కార్యాలయానికి రావాలని ఆదేశించారన్నారు.

డీఆర్‌ఓగా కొండయ్య

ప్రశాంతినిలయం: డిస్ట్రిక్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (డీఆర్‌ఓ)గా కొండయ్యను నియమిస్తూ ప్రభుత్వ చీప్‌ సెక్రెటరీ సాయిప్రసాద్‌ ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లాలో పని చేస్తున్న విజయ సారథి ఏప్రిల్‌ 30న పదవీ విరమణ పొందారు. కొండయ్య గతంలో జిల్లాలో పని చేస్తూ నెల్లూరు డిప్యూటీ కలెక్టర్‌గా వెళ్లారు. తిరిగి జిల్లాకు డీఆర్‌ఓగా బదిలీ అయ్యారు.

కేఎఫ్‌ఆర్‌ వర్సిటీతో

జేఎన్‌టీయూ ఒప్పందం

అనంతపురం: అంతర్జాతీయ స్థాయి పోటీకి దీటుగా విద్యా ప్రమాణాలు పెంపుదల చేసేలా జర్మనీలోని కేఎఫ్‌ఆర్‌ యూనివర్సిటీతో జేఎన్‌టీయూ(ఏ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రెండు వర్సిటీల ప్రతినిధులు అవగాహన ఒప్పంద పత్రాలను శుక్రవారం మార్చుకున్నారు. ఈ సందర్భంగా జేఎన్‌టీయూ వీసీ డాక్టర్‌ హెచ్‌.సుదర్శనరావు మాట్లాడుతూ.. ఉన్నత విద్యా రంగంలో అంతర్జాతీయ సహకారాల ప్రాముఖ్యత పెంపొందించేలా రెండు విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారం అందిపుచ్చుకోనున్నట్లు తెలిపారు. జర్మనీలోని ఆ విశ్వవిద్యాలయ నాలెడ్జ్‌ ఫౌండేషన్‌ సీఈఓ డేనియల్‌ గీగిస్‌ వర్చువల్‌గా మాట్లాడుతూ.. జేఎన్‌టీయూ(ఏ)తో చేసుకున్న ఒప్పందం మేరకు ముందుకు సాగుతామని పేర్కొన్నారు. అలాగే, ఏర్పాటు చేసిన స్టీరింగ్‌ కమిటీతో అన్ని విధివిధానాలను ఖరారు చేస్తామని తెలిపారు. జర్మనీ వర్సిటీ ప్రతినిధులు రాజ్‌ వంగపండు, శ్యామ్‌ సుందర్‌, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ ఎస్‌. కృష్ణయ్య, డీఏపీ ప్రొఫెసర్‌ ఎస్వీ సత్యనారాయణ, అడ్మిషన్లు – విదేశీ వ్యవహారాల డైరెక్టర్‌ ఎ.సురేష్‌బాబు, ప్రొఫెసర్‌ భానుమూర్తి , ఓఎస్డీటూ వీసీ ప్రొఫెసర్‌ ఓ.దేవన్న తదితరులు పాల్గొన్నారు.

దళిత యువకుడిపై హత్యాయత్నం

అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలింపు

తాడిమర్రి: మండలంలోని దాడితోట గ్రామంలో దళిత యువకుడిపై హత్యాయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కుళ్లాయప్ప కుమారుడు బద్రి పదో తరగతి వరకు చదువుకున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో చదువు మానేసి గ్రామంలో అరటి కాయల వ్యాపారి వద్ద కూలీగా పనిచేస్తున్నాడు. ఈ శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో కూలి సొమ్ము తీసుకుని మిగిలిన కూలీలతో కలసి స్వగ్రామానికి బయలుదేరిన బద్రిపై గ్రామానికి చెందిన రమణారెడ్డి కుమారుడు శశిభూషణ్‌రెడ్డి కొడవలి విసిరాడు. దీంతో బద్రి వీపుపై లోతైన గాయమైంది. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ కృష్ణవేణి... దాడికి పాల్పడిన శశిభూషణ్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. హత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement