ప్చ్‌.. ఫలితం మారలేదు | - | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. ఫలితం మారలేదు

May 1 2026 8:08 AM | Updated on May 1 2026 8:08 AM

పుట్టపర్తి: పదో తరగతి ఫలితాల్లో ఈసారి కూడా జిల్లా పల్టీ కొట్టింది. 100 రోజుల ప్రణాళిక పేరుతో ప్రత్యేక తరగతులు నిర్వహించినా ఫలితం మాత్రం మారలేదు. జిల్లా నుంచి 21,183 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 16,977 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లా ఉత్తీర్ణత శాతం 80.14 నమోదుకాగా, రాష్ట్రస్థాయిలో 22వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఏడాది ఫలితాల్లో జిల్లాకు 23వ స్థానం రాగా, ఈ సారి ఒక మెట్టు ఎక్కి 22వ స్థానానికి చేరుకుంది.

13,629 మందికి ఫస్ట్‌ క్లాస్‌

జిల్లాకు చెందిన 16,977 మంది ఉత్తీర్ణులుకాగా, అందులో 13,629 మంది ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యారు. అలాగే 2,422 మంది సెకండ్‌ క్లాస్‌లో, 926 మంది థర్డ్‌ క్లాస్‌లో పాసయ్యారు.

సత్తా చాటిన బాలికలు

పదో తరగతి ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలు సత్తా చాటారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి జిల్లా టాపర్లుగా ఇద్దరూ బాలికలే నిలిచారు. జిల్లా నుంచి 10,162 మంది బాలికలు పరీక్ష రాయగా, 8,553 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో 84.17 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది.

పలువురికి 590పైగా మార్కులు

జిల్లాలోని 74 పాఠశాలల్లోని విద్యార్థులు 590పైగా మార్కులు సాధించటం విశేషం. పరిగి సేవా మందిరం పాఠశాలకు చెందిన టి. శిరీష 593 మార్కులు, కదిరి బాలికల పాఠశాల విద్యార్థి ఆఫీఫా ఫాతిమా 593 మార్కులు సాధించి మొదటి స్థానాల్లో నిలిచారు. బుక్కపట్నం మండలం సిద్దరాంపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సందీప్‌ రెడ్డి 592 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. మరో నలుగురు విద్యార్థులు కూడా ఈ ఘనత సాధించారు. ఇక ప్రైవేట్‌ స్కూల్స్‌కు సంబంధించి గోరంట్ల శ్రీచైతన్య పాఠశాలకు చెందిన శ్రీజరెడ్డి 597 మార్కులు సాధించి ప్రైవేట్‌ పాఠశాలల్లో మొదటి స్థానంలో నిలిచాడు. సత్తా చాటిన విద్యార్థులను యాజమాన్యాలు అభినందించాయి.

గురుకులాల ఫలితాలు ఇలా...

పదో తరగతి ఫలితాల్లో గురుకులాలు వెనుకబడ్డాయి. ఏపీఆర్‌ఈఐఎస్‌ 96.05 శాతం, మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలు 95.04 శాతం, ఏపీ వెల్ఫేర్‌ పాఠశాలలు 92.34 శాతం, కేజీబీవీలు 87.11 శాతం ఫలితాలు సాధించాయి.

25 నుంచి సప్లిమెంటరీ

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 25వ తేదీ నుంచి జూన్‌ 4 వరకు జరుగుతాయి. పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఈనెల 9వ తేదీ లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 50 అపరాధ రుసుంతో ఈనెల 25 వరకు ఫీజు చెల్లింవచ్చని డీఈఓ కిష్టప్ప తెలిపారు. మూడుకంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125, మూడుకంటే తక్కువ సబ్జెక్టులకు రూ. 110, మైగ్రేషన్‌ రుసుం రూ. 80 చొప్పన చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీకౌంటింగ్‌ కోరే విద్యార్థులు రూ. 500, రీ వెరిఫికేషన్‌, జవాబుపత్రాలు జిరాక్స్‌ ప్రతులు కోరే విద్యార్థులు సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించి ఈనెల 7వ తేదీ లోపు సంబంధిత ప్రధానోపాధ్యాయుల లాగిన్లలో మాత్రమే దరఖాస్తు చేయాలని డీఈఓ స్పష్టం చేశారు. నేరుగా డీఈఓ కార్యాలయానికి గాని, బోర్డ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ వారికి పోస్ట్‌ద్వారా గానీ, వ్యక్తిగతంగా గానీ అందజేసినా స్వీకరించబోమని స్పష్టం చేశారు.

పది ఫలితాల్లో జిల్లాకు అట్టడుగు స్థానం

22వ స్థానంతో సరిపెట్టుకున్న వైనం

గత ఏడాదితో పోలిస్తే ఒక స్థానం మెరుగు

ఈసారి సత్తా చాటిన బాలికలు

ఆఫీఫాకు అభినందన

కదిరి అర్బన్‌: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కదిరి జెడ్పీహైస్కూల్‌లో చదివే ఆఫీఫా ఫాతిమా 593 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. ఆఫీఫా ఫాతిమా తండ్రి మొఘల్‌ మన్సూర్‌ అలీ బంగారం దుకాణం నిర్వహిస్తారు. తల్లి మొఘల్‌ రుక్సానా గృహిణి. గురువారం కదిరి జెడ్పీహైస్కూల్‌లో డీఈఓ కిష్టప్ప బాలికను తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో అభినందించారు. ఆయన వెంట హెచ్‌ఎం వెంకటాచలం, ఎంఈఓ చెన్నకృష్ణ, ఓబుల్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement