కదిరి: స్థానిక మున్సిపల్ కమిషనర్ ఎవరన్న సందిగ్ధం వీడింది. అధికార పార్టీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ చేసిన విశ్వప్రయత్నాలన్నీ విఫలం కాగా, గురువారం ఏఈ వజ్ర సందీప్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. రెండు రోజుల క్రితమే కదిరి కమిషనర్‌గా బాధ్యతలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడినప్పటికీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు బెదిరించడంతో సందీప్ సందిగ్ధంలో పడ్డాడు. దీంతో మళ్లీ ఇటీవల బదిలీ అయిన కిరణ్‌కుమార్‌కే కమిషనర్ సీటు అంటూ కొందరు ప్రచారం చేశారు. అయితే గురువారం మధ్యాహ్నం ఒంటిగంటలోపు బాధ్యతలు చేపట్టక పోతే సస్పెన్షన్ ఆర్డర్స్ పంపుతామని ఉన్నతాధికారులు హెచ్చరించడంతో సందీప్ బాధ్యతలు చేపట్టారు. దీంతో కదిరి మున్సిపల్ కమిషనర్ ‘పీఠం’పై సందిగ్ధం తొలగింది.
మళ్లీ నేనంటూ ధీమా
రెండేళ్లుగా ఇక్కడ కమిషనర్‌గా ఉంటూ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని మాతృశాఖ (హార్టికల్చర్)కు బదిలీ అయిన కిరణ్‌కుమార్ ఇక్కడి నుంచి రిలీవ్ అయ్యేందుకు సముఖత చూపలేదు. తనకు ఎమ్మెల్యే కందికుంట మద్దతు ఉన్నంత వరకూ ఎవ్వరూ ఏమీ చేయలేరని, తాను ఇక్కడే కొనసాగుతానని కొందరు తాజా మాజీ కౌన్సిలర్లతో పాటు మున్సిపల్ సిబ్బందితో అన్నట్లు సమాచారం. ఈ నెల 4వ తేదీ లోపు మళ్లీ తనను ఇక్కడే కొనసాగించే విధంగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేసినట్లు వారు పేర్కొంటున్నారు.
రూ.కోటి సంగతేంటి?
తనను కదిరి మున్సిపల్ కమిషనర్‌గా కొనసాగించేందుకు కిరణ్ కుమార్ స్థానికంగా ఓ ముఖ్యనేతకు రూ.కోటి సమర్పించినట్లు కూటమి పార్టీ నేతలే కొందరు ఆరోపిస్తున్నారు. ఈ రెండేళ్లలో ఆయన సుమారు రూ.10 కోట్ల వరకూ అక్రమంగా సంపాదించారని, అందులో 60 శాతం (రూ.6 కోట్లు) విడతల వారీగా ఆ నేతకు ముట్టజెప్పారని వారు ఆరోపిస్తున్నారు. ఆయన అవినీతి చిట్టా మొత్తం వివరాలతో సహా త్వరలోనే బహిర్గతం చేస్తామని వారు పేర్కొంటున్నారు.
బాణసంచా పేల్చి సంబరాలు
సాధారణంగా ఒక ఉద్యోగి బదిలీపై వెళ్తుంటే తోటి ఉద్యోగులు బాధపడటం సర్వ సాధారణం. బదిలీపై వెళ్లే అధికారిని ఘనంగా సన్మానించి వీడ్కోలు చెప్పడం కూడా చూస్తుంటాం. కానీ కదిరిలో అందుకు భిన్నంగా జరుగుతోంది. మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్ బదిలీపై వెళ్తుంటే మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందితో పాటు మున్సిపల్ పరిధిలోని సచివాలయ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏకంగా మున్సిపల్ కార్యాలయం ముందే బాణసంచా పేల్చి ఆయన పట్ల తమకున్న వ్యతిరేకతను చాటుకున్నారు.


