ధర్మవరం అర్బన్: చేతి బదులుగా తెలిసిన వ్యక్తికి డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బు వెనక్కి ఇవ్వాలని అడిగితే మద్యం తాపించి దాడి చేసి హతమార్చారు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరానికి చెందిన పూల రమణారెడ్డి(40)కి భార్య రామంజినమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబంతో పాటు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నివాసముంటూ అక్కడే మరమగ్గాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ధర్మవరానికి చెందిన తన స్నేహితుడు చక్రవర్తి అలియాస్ చక్రికి కొన్నేళ్ల క్రితం రూ.4 లక్షలు చేతి బదులుగా ఇచ్చాడు. ఆ డబ్బు ఇవ్వాలని రమణారెడ్డి అడగడంతో రూ.లక్ష చెల్లించాడు. మిగిలిన రూ.3 లక్షలు కూడా ఇవ్వాలని తరచూ చక్రికి రమణారెడ్డి ఫోన్ చేసేవాడు. అయినా చక్రి పట్టించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు చోటు చేసుకున్నాయి. ధర్మవరంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి రథోత్సవం సందర్భంగా ఇటీవల స్థానిక చంద్రబాబునగర్‌లో ఉన్న తన అక్క సుజాత ఇంటికి రమణారెడ్డి వచ్చాడు. బుధవారం రాత్రి చక్రిని కలిసి తన స్నేహితులతో కలిసి డిన్నర్ ఉందని రమణారెడ్డిని పిలుచుకుని మార్కెట్‌యార్డు సమీపంలో ఉన్న ఓ కార్ల సర్వీసింగ్ సెంటర్‌లోకి పిలుచుకెళ్లాడు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. ఆ సమయంలో రమణారెడ్డి తనకివ్వాల్సిన రూ.3లక్షల గురించి చక్రిని అడిగాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ఒకానొక దశలో చక్రి తన స్నేహితులతో కలిసి రమణారెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలతో పడిపోయిన రమణారెడ్డిని కారులో తీసుకెళ్లి అతని అక్క సుజాత ఇంటి ఎదుట పడేసి వెళ్లిపోయారు. ఆ సమయంలో శబ్దం రావడంతో సుజాత బయటకు వచ్చి చూసింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న రమణారెడ్డిని గమనించి ఆరా తీయడంతో చక్రి, అతని స్నేహితులు కొట్టి అక్కడ పడేసి వెళ్లారని తెలిపాడు. వెంటనే రమణారెడ్డిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రమణారెడ్డి అక్క సుజాత, భార్య రామంజినమ్మ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ రెడ్డెప్ప తెలిపారు.
అప్పుగా ఇచ్చిన డబ్బు
అడిగినందుకు దాడి
తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఇంటి వద్ద పడేసిన వైనం
ఆస్పత్రికి తరలించేలోపే మృతి


