హిందూపురం: వీలైనంత త్వరగా హిందూపురంలో సెకండ్ క్లాస్ జూనియర్ సివిల్ జడ్జికోర్టు ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి భీమారావు తెలిపారు. హిందూపురం వాసులకు న్యాయ సేవల్లో ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వకుండా చర్యలు తీసుకుంటామన్నారు. హిందూపురానికి ఇటీవల రెండో జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం మంజూరు కావడంతో న్యాయస్థానం నిర్వహణకు అనువైన భవనాన్ని పరిశీలించేందుకు గురువారం ఆయన హిందూపురంలో పర్యటించారు. అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ, అదనపు జూనియర్ సివిల్ జడ్జి లలితా లక్ష్మి హారిక, ప్రత్యేక న్యాయమూర్తి రమణయ్యలతో కలిసి స్థానిక పశుసంవర్ధక శాఖ భవనంలో నిర్వహిస్తున్న న్యాయస్థానాల సముదాయంలోని మూడవ అంతస్తును పరిశీలించారు. భవనం అనువుగా ఉన్నందున నూతన న్యాయస్థానానికి అవసరమైన ఫర్నీచర్, ఫ్యాన్లు తదితర వాటిని సమకూర్చేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం న్యాయమూర్తుల చాంబర్లు రికార్డు గదిని పరిశీలించారు. నూతన న్యాయస్థానంలో న్యాయమూర్తి ఛాంబర్, ప్రత్యేక న్యాయస్థానం ఆఫీసు నిర్వహణకు మార్పులు చేయాలన్నారు.
హిందూపురంలో న్యాయసేవలకు
ఇబ్బందులు కలగనివ్వం
జిల్లా న్యాయమూర్తి భీమారావు


