పెనుకొండ రూరల్: చంద్రబాబు తన స్వార్థం కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేసి రైతుల నోట్లో మట్టికొట్టారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాయలసీమలోని జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు. 9.6 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పటికే రూ.800 కోట్లు ఖర్చు చేసిందన్నారు. నేటి పాలకులు స్వార్థ రాజకీయాల కోసమే ప్రాజెక్టును తాకట్టు పెట్టారన్నారు. దీనివల్ల లక్షల ఎకరాలు బీడుగా మిగిలిపోయాయి, వేలాది మంది రైతులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేపట్టకుండా నిలువరించిందని ఉషశ్రీచరణ్ అన్నారు. గత జగన్ సర్కార్ సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పథకాలు అమలు చేసిందన్నారు. ఈ క్రమంలోనే రైతులు సంక్షేమం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేసిందని వివరించారు. శ్రీశైలం కుడిగట్లు కాలువ, తెలుగు గంగా, గాలేరు, నగరి సుజల స్రవంతి నుంచి కృష్ణా జలాలు వాడుకుని రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలను సశ్యామలంగా తీర్చిదిద్దే విధంగా చర్యలు చేపట్టిందన్నారు. కానీ చంద్రబాబు సర్కార్ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నేడు మంగళం పాడేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. రాయలసీమ జీవనాడిని దెబ్బతీస్తున్న చంద్రబాబు...రైతుల కడుపుకొడుతున్న విషయం గమనించాలన్నారు. ఇప్పటికై నా బుద్ధి తెచ్చుకుని సీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. లేకపోతే రాయలసీమ వాసులు తప్పక బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


