మడకశిర: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు విమర్శించారు. గుడిబండ మండలం మందలపల్లి గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన దళిత యువకుడు విజయభాస్కర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకూ పోరాటం సాగిస్తామని బాధితులకు భరోసానిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విజయభాస్కర్‌ది సాధారణ మరణం కాదని, అలాగని అనుమానాస్పద మరణం కూడా కాదని అన్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని పేర్కొన్నారు. హతుడి కుటుంబసభ్యులు పలువురిపై అనుమానం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అనుమాన్పాద మృతి కింద కేసు నమోదు చేసి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఘటన జరిగి వారం రోజులు గడిచినా నేటికీ పోస్టుమార్టం నివేదికను బహిర్గతం చేయకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వెంటనే పోస్టుమార్టం నివేదికను వెల్లడించడంతో పాటు హత్య కేసు నమోదు చేసి విజయభాస్కర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ నాయకులు హనుమంతు, సాకే ఓబులేసు, మిణుగు రామాంజనేయులు, కుళ్లాయప్ప, తలారి నాని తదితరులు పాల్గొన్నారు.
విజయభాస్కర్‌ది ముమ్మాటికీ హత్యే
బాధిత కుటుంబానికి న్యాయం
చేకూరకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
దాసరి సువర్ణరాజు


