పెనుకొండ(సోమందేపల్లి): ఈత సరదా ఓ బాలుడి ప్రాణాలను బలిగొంది. స్థానికులు తెలిపిన మేరకు... హిందూపురంలోని హస్నాబాద్‌కు చెందిన సమీర్ (18) బుధవారం కుటుంబసభ్యులతో కలసి సోమందేపల్లిలోని నక్కల గుట్ట ప్రాంతానికి ఈత కొట్టేందుకు వచ్చాడు. జోరుగా ప్రవహిస్తున్న హంద్రీ–నీవా కాలువ నీటిలో దిగిన వెంటనే గల్లంతయ్యాడు. ఆ సమయంలో కుటుంబసభ్యుల కేకలు విన్న పరిసరాల్లోని యువకులు వెంటనే కాలువలో దిగి గాలింపు చేపట్టినా ఆచూకీ లభ్యం కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్తులు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టి నీటి అడుగుభాగంలో చిక్కుకుపోయిన సమీర్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జూన్ నాటికి లే అవుట్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
● అహుడా వైస్ చైర్మన్ విష్ణుచరణ్
ధర్మవరం రూరల్: మండలంలోని కుణుతూరు వద్ద అహుడా లే అవుట్ అభివృద్ధి పనులు జూన్ నాటికి పూర్తి కావాలని సంబంధిత అధికారులను అహుడా వైస్ చైర్మన్ సి. విష్ణుచరణ్ ఆదేశించారు. లేఔట్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. రోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఈఈ దుష్యంత్, డీఈ రేవంత్, పబ్లిక్ హెల్త్ డీఈ జ్వోతి తదితరులు పాల్గొన్నారు.
పిడుదుల మందు తాగిన చిన్నారి
తనకల్లు: మండలంలోని గందోడివారిపల్లికి చెందిన గణేష్ కుమార్తె, నాలుగేళ్ల చిన్నారి పూజిత పిడుదల మందు తాగింది. బుధవారం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా దాహం వేయడంతో బాటిల్ ఉన్న ద్రావకాన్ని నీరుగా భావించి తాగడంతో కుటుంబసభ్యులు గమనించి వెంటనే తనకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.


