గంజాయి ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి ముఠా అరెస్ట్‌

Apr 30 2026 7:31 AM | Updated on Apr 30 2026 7:31 AM

10.55 కేజీల గంజాయి స్వాధీనం

తాడిపత్రి టౌన్‌: తాడిపత్రి మీదుగా సూరత్‌కు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు సభ్యులు గల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం తాడిపత్రి పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్పీ రోహిత్‌కుమార్‌ మీడియాకు వెల్లడించారు. ఒడిశాకు చెందిన బలరాం స్వామ్స్‌, ఆకాష్‌ సాహగ్‌ ఒడిశా నుంచి గంజాయిని తాడిపత్రి మీదుగా సూరత్‌కు సరఫరా చేస్తున్నారు. ఇందులో భాగంగా సూరత్‌కు రైలులో గంజాయి తీసుకెళ్తుండా అందిన సమాచారం మేరకు తాడిపత్రి పోలీసులు బుధవారం రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన బలరాం స్వామ్స్‌, ఆకాష్‌ సాహగ్‌ను సోదా చేయగా వారి వద్ద 10.55 కేజీల గంజాయి దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు మైనర్‌ కావడంతో తదుపరి చర్యల కోసం కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. చాకచక్యంగా ముఠాను పట్టుకున్న కానిస్టేబుల్‌ గోవిందుకు రివార్డు అందజేశారు. కార్యక్రమంలో సీఐ ఆరోహణరావు, ఎస్‌ఐ దయాకర్‌రెడ్డి, ఏఎస్‌ఐ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

లారీ డ్రైవర్‌ దుర్మరణం

క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన మృతదేహం

రాప్తాడు రూరల్‌: మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో లారీ డ్రైవర్‌ దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం కొత్తవారిపల్లి గ్రామానికి చెందిన బి.భాస్కర్‌రెడ్డి (32) కర్ణాటకలోని బాగేపల్లి తాలూకా పొట్టోళ్లపల్లిలో నివాశముంటూ లారీ డ్రైవరుగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కేఏ40బీ 7198 నంబర్‌ గల లారీలో హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు గ్రానైట్‌ లోడుతో బయలుదేరిన భాస్కరరెడ్డి బుధవారం తెల్లవారుజామున రాప్తాడు మండలం హంపాపురం సమీపంలోని ఎస్వీఐటీ కళాశాల వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై ముందు వెళుతున్న సిమెంట్‌ లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ప్రమాదతీవ్రతకు గ్రానైట్‌ బలంగా క్యాబిన్‌ను తాకడంతో క్యాబిన్‌ ఛిద్రమైంది. డ్రైవరు భాస్కరరెడ్డి అందులో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గంటకు పైగా శ్రమించి మృతదేహన్ని వెలికి తీసి అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద లభించిన ఆధారాల మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా నిద్రమత్తు కారణంగా ఈ ఘటన చోటు చేసుకుని ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement