గుంతకల్లు: విశాఖపట్నం – కడప జంక్షన్ల మధ్య రాకపోకలు సాగిస్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను గుంతకల్లు వరకూ పొడిగించారు. ఈ మేరకు రైల్వేబోర్డు నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు డివిజన్ అధికారులు బుధవారం వెల్లడించారు. రోజు మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం జంక్షన్ నుంచి బయలుదేరిన తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు (18521) మరుసటి రోజు ఉదయం 7 గంటలకు కడపకు చేరుతుండేది. అయితే తిరుగు ప్రయాణంలో (18522) సాయంత్రం 5 గంటలకు కడప నుంచి బయలుదేరేది. దాదాపు పది గంటల పాటు కడప జంక్షన్‌లోనే ఈ రైలు నిలిచిపోతుండడంతో, ఆ సమయాన్ని వృథా కానివ్వకుండా కడప – గుంతకల్లు మధ్య నడిపేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకున్నారు. మే 12 నుంచి విశాఖపట్నం–గుంతకల్లు మధ్య ఈ రైలు నడవనుంది. దీంతో గుంతకల్లు జంక్షన్ నుంచి రోజూ మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. గుత్తి, తాడిపత్రి, కొండాపురం, ఎర్రగుంట్ల, కడప, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట, తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, నిడదవోలు, తెనాలి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, భీమడోలు, తాడేపల్లిగూడం, కొవూరు, రాజమండ్రి, ద్వారంపూడి, అనపర్తి, సామర్లకోట, పుత్తపురం, అన్నవరం, తూని, నర్సీపట్నం, యలమంచి, అనకాపల్లి, దువ్వాడ మీదుగా విశాఖపట్నం చేరుతుంది.
నేటితో ముగియనున్న శాప్ ఫుట్‌బాల్ టోర్నీ
అనంతపురం: ఆర్డీటీ స్టేడియంలో నిర్వహిస్తున్న శాప్ ఫుట్‌బాల్ టోర్నీ గురువారంతో ముగియనుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో అండర్–15 బాలుర విభాగంలో ముందంజలో అన్నమయ్య, నెల్లూరు, శ్రీసత్యసాయి, తిరుపతి, ఏలూరు, పల్నాడు, శ్రీకాకుళం, అనంతపురం, నెల్లూరు, కృష్ణా జట్లు ఉన్నాయి. అలాగే బాలికల విభాగంలో నెల్లూరు, కర్నూలు, అనంతపురం, ఏలూరు, అన్నమయ్య జట్లు, అండర్–21 పురుషుల విభాగంలో అల్లూరి సీతారామరాజు, తిరుపతి, ఏలూరు, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, శ్రీసత్యసాయి, తిరుపతి, గుంటూరు, అన్నమయ్య, మహిళా విభాగంలో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు జట్లు ముందంజలో ఉన్నాయి.


