తాడిపత్రి రూరల్: స్థానిక గన్నెవారిపల్లి కాలనీలో నివాసముంటున్న వివాహిత గంగాపావని (19) ఆత్మహత్య చేసుకుంది. గంగాపావని, సాయి ప్రేమించి 7 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి రెండు కుటుంబాలకు ఇష్టం లేదు. ఈ కారణంగా తరుచుగా రెండు కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకునేవి. దీంతో మనస్తాపానికి గురైన గంగాపావని బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి వెంకటనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు.
చీటింగ్ కేసు నమోదు
తలుపుల: డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను బుధవారం వెల్లడించారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం మూడిళ్లపల్లికి చెందిన రామాంజనేయులు, ఓబులరెడ్డి తలుపుల మండలం సంగటివారిపల్లికి చెందిన మల్లినాయుడు వద్ద గత ఏడాది జనవరిలో 105 పొట్టేళ్లను రూ.11.20 లక్షలతో కొనుగోలు చేశారు. అప్పట్లో రూ.4.20 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించారు. ఈ క్రమంలో మిగిలిన డబ్బు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. గట్టిగా అడిగితే బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు రామాంజనేయులు, ఓబులరెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెన్నయ్య తెలిపారు.


