పల్లెలకూ పాకిన పాడు సంస్కృతి | - | Sakshi
Sakshi News home page

పల్లెలకూ పాకిన పాడు సంస్కృతి

Apr 29 2026 8:42 AM | Updated on Apr 29 2026 8:42 AM

సాక్షి, పుట్టపర్తి: విదేశాల్లోని పాడు సంస్కృతి ప్రధాన నగరాల నుంచి పట్టణాలు, పల్లెల వరకు వ్యాపించింది. రిసార్టులు, స్పా, గ్రాండ్‌ స్టే, హోం స్టే, లగ్జరీ రూమ్స్‌ పేరుతో భారీగా దందా జరుగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా మొదలయ్యే వ్యవహారం సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా తర్వాత బ్లాక్‌మెయిల్‌కు దిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్‌ కేసు సంచలనం సృష్టించింది. శ్రీసత్యసాయి జిల్లాలోనూ అలాంటివి వెలుగు చూసే అవకాశం లేకపోలేదు. పోలీసులు అప్రమత్తమై అడ్డుకుంటే కానీ వ్యవహారం అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ఆధార్‌ కార్డు చూపిస్తే ప్రవేశానికి అనుమతిస్తూ.. ‘ఆ ఇద్దరు’ ఎవరనేది నిర్వాహకులు పట్టించుకోవడంలేదు. గంట నుంచి రోజుకు చొప్పున అద్దె నిర్ణయిస్తూ దండుకుంటున్నారు. జిల్లాలోని శివారు ప్రాంతాల్లో ఏర్పాటైన రిసార్టుల్లో బెంగళూరు నుంచి వారంతపు సెలవుల్లో విచ్చలవిడిగా జంటలు వస్తున్నారు. ముఖ్యంగా ప్రతి శని, ఆదివారాల్లో ఆయా ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.

పెడదోవ పడుతున్న యువత

పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో గుడి, బడి తేడా లేకుండా పాడు సంస్కృతి విస్తరించింది. ప్రతి వారం గుడికి వెళ్తున్నామని.. పర్యాటక ప్రాంతాల పేరుతో ఇంట్లో చెప్పి బయట తిరుగుతున్న వారి సంఖ్య పెరిగింది. పుట్టపర్తి, లేపాక్షి, పెనుకొండ చుట్టుపక్కల వారంతపు సెలవుల్లో యాత్రల పేరుతో చాలామంది వస్తున్నారు. అక్కడక్కడా పర్యాటకుల సౌకర్యార్థం రిసార్టులు, హోం స్టేలు ఏర్పాటు చేశారు. అనధికారికంగా అన్నింటికీ అనుమతిస్తున్నారు. దీంతో అధికశాతం మంది కాలేజీకి వెళ్లే యువత దారి తప్పుతోంది. ఆరంభంలోనే నియంత్రించకుంటే తొందరలోనే సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా యువతీ, యువకులను బ్లాక్‌మెయిల్‌ చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొంతమంది ట్రాప్‌లో పడి రూ.లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం.

బెంగళూరు నుంచి

యువతుల దిగుమతి

రిసార్టులు, గ్రాండ్‌ స్టే, హోంస్టే, లగ్జరీ రూమ్స్‌ పేరుతో దందా

ఆధార్‌ కార్డుతోనే

అద్దె రూముల్లోకి ఎంట్రీ పర్మిట్‌

ఆ ‘ఇద్దరు’ ఎవరనేది

పట్టించుకోని నిర్వాహకులు

చిలమత్తూరు మండలం సోమఘట్ట సమీపంలో ఢిల్లీకి చెందిన ఓ బడాబాబు రిసార్ట్‌ నిర్మించారు. అక్కడ రూములు అద్దెకు ఇస్తారు. ఎవరు వస్తున్నారనే విషయం తెలీదు. డబ్బులు చెల్లిస్తే చాలు.. వసతి కల్పిస్తున్నారు. వారాంతపు సెలవుల్లో విచ్చలవిడిగా జంటలు వస్తుంటారు. రిసార్టు వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఉంటాయి. పోలీసులు ఎవరూ పట్టించుకోరని నమ్మబలికి జంటలకు రూములు ఇస్తున్నారు.

గోరంట్ల మండలం పాలసముద్రం సమీపాన ఓ పెద్ద రిసార్టు ఉంది. రోజు వారీ బాడుగకు రూములు ఇస్తారు. ఆధార్‌ కార్డు చూపిస్తే చాలు.. ఆ ఇద్దరు ఎవరనే విషయంతో సంబంధం లేకుండా జంటలకు వసతి కల్పిస్తున్నారు. పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి ఎక్కువ మంది వస్తున్నట్లు సమాచారం. తెలుగు రాని వారు సైతం అద్దెకు ఉంటున్నారు. గంటల వ్యవధిలోనే ఖాళీ చేసి వెళ్తున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement