కదిరి మున్సిపల్‌ కమిషనర్‌గా సందీప్‌ | - | Sakshi
Sakshi News home page

కదిరి మున్సిపల్‌ కమిషనర్‌గా సందీప్‌

Apr 29 2026 8:42 AM | Updated on Apr 29 2026 8:42 AM

కదిరి: మున్సిపాలిటీలో ఏఈఈ వి.సందీప్‌కు కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ పి.సంపత్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లుగా ఇక్కడ డెప్యుటేషన్‌పైన కమిషనర్‌గా ఉన్న కె.కిరణ్‌కుమార్‌ను ఆయన మాతృశాఖ (హార్టికల్చర్‌)కు పంపారు. అయితే కిరణ్‌నే కమిషనర్‌గా కొనసాగించాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మున్సిపల్‌ శాఖామంత్రి నారాయణపై ఈ విషయంలో ఆయన ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ మంత్రి ఒప్పుకోలేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. కాగా కిరణ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విజిలెన్స్‌ విచారణకు కొందరు కూటమి పార్టీ నేతలు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.

ఎల్లుండి మల్లెపూల ఉత్సవం

కదిరి టౌన్‌: స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి 1వ తేదీన (శుక్రవారం) పట్టణంలోని మద్దిలేరు ఒడ్డున ఉన్న మల్లెపూల మండపం వద్ద మల్లెపూల ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉభయదారులుగా కదిరి వాస్తవులు మల్లెపూల నరసయ్య కుమారులు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఖాద్రీ ఆలయం నుంచి స్వామివారు సాయంత్రం 4 గంటలకు బయలుదేరి 5 గంటలకు మల్లెపూల మండపం వద్దకు చేరుకుంటారన్నారు. తరువాత అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారని, సాయంత్రం 6 గంటలకు తిరువీధుల్లో స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారని పేర్కొన్నారు. భక్తాదులు పెద్ద ఎత్తున హజరై ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఒక్క హామీనైనా

అమలు చేశారా?

కదిరి అర్బన్‌: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు ఒక్కటీ పరిష్కరించలేదని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి విమర్శించారు. మంగళవారం కదిరి పట్టణంలోని ఆమె నివాసంలో వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై మే 6న విజయవాడలోని ధర్నాచౌక్‌లో తలపెట్టిన మహాధర్నాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికై వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ దశలవారీ పోరాటంలో భాగంలో మే 6న మహాధర్నా చేపడుతోందన్నారు. ధర్నాకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీద్‌, జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్‌రెడ్డి, శివయ్య, ప్రకాష్‌రెడ్డి, జమీర్‌, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రత సామగ్రి పంపిణీ

ప్రశాంతి నిలయం: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సమయాల్లో వినియోగించే సామగ్రిని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ఎస్పీ సతీష్‌కుమార్‌కు అందజేశారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో నేషనల్‌ హైవేస్‌ ఎస్‌ఈ సుబ్బరాయుడు సమకూర్చిన 245 కోన్లు, 245 డిఫ్లెక్టివ్‌ జాకెట్లు, 90 టార్చ్‌లైట్లను అందించారు.

పనిముట్లు సద్వినియోగం చేసుకోండి

పీఎం విశ్వకర్మ పథకం కింద చేతి వృత్తుల వారికి ఇచ్చిన పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ సూచించారు. శిక్షణ పొందిన 17 రకాల చేతివృత్తుల వారికి రూ.15 వేలు విలువ చేసే పనిముట్లను అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 7,200 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమలశాఖ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి

పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అన్నారు. విశాఖ పట్నం గ్లోబల సమ్మిట్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు పరిశ్రమలను స్థాపించడానికి అన్ని రకాల అనుమతులు జారీ చేయడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ ద్వారా అనుమతులిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement