ప్రశాంతి నిలయం: జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఎన్ కార్డు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని వినియోగించుకోవాలన్నారు. పాత కేసుల్లో నిందితులపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. వారిని బైండోవర్ చేయాలన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్, డీపీఈఓ గోవింద్, ఏఈఎస్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
పీఎం రహత్ ద్వారా నగదు రహిత చికిత్స
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచితంగా నగదు రహిత చికిత్స అందించడానికి పీఎం రహత్ పథకాన్ని కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పీఎం రహత్ పథకానికి సంబంధించి పోస్టర్లు విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన మొదటి 24 గంటల్లో (గోల్డెన్ అవర్)లో ఆస్పత్రి చేరిన వారికి అత్యవసర వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ పథకం కింద ఒక వ్యక్తికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ అత్యవసర చికిత్సకు కవర్ అవుతుందన్నారు. ఆ మొత్తం దాటితే ఎన్‌టీఆర్ వైద్య సేవల పథకాన్ని వర్తింపజేస్తారన్నారు. కార్యక్రమంలో ఎస్పీ సతీష్‌కుమార్, ఆర్టీఓ కరుణ సాగర్‌రెడ్డి, ఆరోగ్య సేవ జిల్లా సమన్వయకర్త శ్రీదేవి, డీసీహెచ్‌ఎస్ మధుసూధన్, తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదాల నివారణే ధ్యేయం
ప్రమాదాల నివారణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయం చేసుకొని రహదారి ప్రమాదాలను తగ్గించాలన్నారు. కియా ఫ్యాక్టరీ పరిసరాల్లో పార్కింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొడికొండ స్పీడ్ బ్రేకర్లు వద్ద 10 మీటర్ల ముందే రంబుల్ స్ట్రిప్, గోస్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.


