ధర ఢమాలు.. రైతు కుదేలు | - | Sakshi
Sakshi News home page

ధర ఢమాలు.. రైతు కుదేలు

Feb 27 2026 4:27 AM | Updated on Feb 27 2026 4:27 AM

ధర ఢమ

ధర ఢమాలు.. రైతు కుదేలు

తాడిమర్రి: చీనీ రైతులకు కష్టాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది నష్టాలు మిగిల్చిన చీనీ.. ఈసారైనా ఆదుకోకపోతుందా..అనుకున్న రైతును మళ్లీ నష్టాలే పలకరిస్తున్నాయి. ఇప్పటికే పెట్టుబడుల కోసం చేసిన అప్పులు నెత్తిన ఉండగా...వాటికి ఈ ఏడాది నష్టాలు తోడయ్యాయి. సీజన్‌ ఆరంభంలో తోటల వద్దకు వచ్చి బేరం చేసిన వ్యాపారులు ఇప్పుడు పత్తా లేకుండా పోవడం.. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేకపోవడంతో చీనీ రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఏటికేడు పెరిగిన విస్తీర్ణం..

జిల్లాలో పండే చీనీకి ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉంటోంది. ముఖ్యంగా నాణ్యతతో పాటు రుచి కూడా బాగా ఉండటంతో మంచి ధర లభిస్తోంది. దీంతో చీనీ సాగుచేసిన రైతులు మొదట్లో లాభాల రుచి చూశారు. దీంతో ఒకరిని చూసి మరొకరు చీనీతోటల సాగుపై దృష్టి సారించారు. డ్రిప్పు సాయంతో నీరు అందిస్తుండటం వల్ల బోర్లలో నీరు తక్కువగా ఉన్నా పంటసాగుకు ఇబ్బందులు కలగడం లేదు. దీంతో రైతులంతా చీనీ సాగుకు మొగ్గుచూపడంతో ఏటికేడు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రధానంగా ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలంలో 8,580 ఎకరాల్లో చీనీ తోటలు విస్తరించి ఉన్నాయి. అలాగే బత్తలపల్లిలో 5,170 ఎకరాలు, ధర్మవరంలో 4,460 ఎకరాలు, ముదిగుబ్బ మండలంలో 4,400 ఎకరాల్లో చీనీ తోటలు సాగు చేస్తున్నారు. ఇక కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి తదితర మండలాల్లోనూ చీనీ తోటలు ఎక్కువగానే ఉన్నాయి. జిల్లాలో మొత్తం 37,500 ఎకరాల్లో చీనీ తోటలు ఉండగా... 4.50 లక్షల చెట్లను రైతులు సాగు చేస్తున్నారు.

ముంచేసిన చీడపీడలు..

ఈసారి అధిక వర్షాలు...ఆ తర్వాత చిరుజల్లులు చీనీ పంటను దారుణంగా దెబ్బతీశాయి. ఈ పరిస్థితుల్లో పూత, పిందె రాకపోవడంతో రైతులు పడరాని పాట్లు పడ్డారు. మరోవైపు చీడపీడలు ఆశించడంతో వాటి నివారణ కోసం అప్పులు చేసి మరీ పురుగుమందులు పిచికారీ చేశారు. అష్టకష్టాలు పడి పంటను కాపాడుకున్నారు. అయితే పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధర లభించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

కొనేవారు లేక రైతుల అవస్థ..

సాధారణంగా జనవరి, ఫిబ్రవరి రాగానే వేసవి కాలం ప్రారంభమై చీనీపంటకు మంచి ధర లభిస్తుంది. కానీ పదిహేను రోజుల వరకు టన్ను రూ.30 వేలు నుంచి రూ.32 వేలు పలికిన చీనీ ప్రస్తుతం రూ.20 వేలకు పడిపోయింది. అది కూడా నాణ్యమైన కాయలకే ఆ మాత్రం ధర దక్కుతోంది. మిగిలిన వాటికి వ్యాపారులు టన్ను రూ.15 వేలలోపే రేటు కడుతున్నారు. వాస్తవానికి జిల్లాలో పండే చీనీలో 80 శాతం వరకు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరుకు చెందిన వ్యాపారులు కొందరు నేరుగానూ, మరికొందరు తమ ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి లేకపోపడంతో రైతు కుదేలయ్యాడు. పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం చీనీ పంట కొని రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు.

చీనీ ధర మళ్లీ నేలచూపు చూస్తోంది. పక్షం రోజుల క్రితం టన్ను రూ.30 వేలు పలికిన చీనీకాయలు... ఇప్పుడు రూ.20 వేలకు కూడా మార్కెట్‌లో అడిగేవారు లేకుండా పోయారు. పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. గత ఏడాదిలాగే ఈసారీ అప్పులే మిగిలాయంటూ నిట్టూరుస్తున్నారు.

చీనీ రైతుకు చేదు గుళిక!

దిగుబడిపై ప్రభావం చూపిన చీడపీడలు

అననుకూల వాతావరణంతో

పూత రాలిన వైనం

ఎలాగోలా పంట కాపాడుకున్నా ‘మద్దతు’ కరువు

పక్షం రోజుల్లో అమాంతం

పడిపోయిన చీనీ ధర

పెట్టుబడి కూడా దక్కడం లేదని

రైతన్నల ఆవేదన

ధర ఢమాలు.. రైతు కుదేలు 1
1/1

ధర ఢమాలు.. రైతు కుదేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement