కదిరికి వెళ్దాం.. ఖాద్రీశున్ని చూద్దాం
సజీవంగా వైకుంఠంలో విహరించాలను కుంటున్నారా.... పక్షంరోజులు శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని తరించాలనుకుంటున్నారా..
అయితే రండి... కదిరికి వెళ్దాం. కాటమరాయుడిగా వెలుగొందుతున్న లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాల్లో పాల్గొందాం. దేవేరులతో కలిసి రోజూ దర్శనమిచ్చే స్వామి వారికి పూజలు చేసి తరిద్దాం.
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. పక్షంరోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాలకు శుక్రవారం(నేడు) ఆలయ ప్రాంగణంలో వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ చేయనున్నారు.
అంకురార్పణకు విశేష ప్రాధాన్యం..
బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణం ఘట్టానికి విశేష ప్రాధాన్యత ఉంది. నవ ధాన్యాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అని పిలుస్తారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందటమే అంకురార్పణ ఘట్టం ముఖ్య ఉద్దేశం. సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే రాత్రి సమయంలో ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు. అగ్నిహోమం ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే సకల దేవతలను ఆహ్వానిస్తారు.
నవధాన్యాల మొలక..
అంకురార్పణ ఘట్టంలోనే భూమాతను ప్రార్థిస్తూ పాలిక(కొత్తకుండ)లను మట్టితో నింపుతారు. చంద్రున్ని ప్రార్థిస్తూ అర్చక బృందం వాటిలో నీరు పోసి నవ ధాన్యాలు చల్లుతారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం చేస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రంతో పాటు విష్ణు సూక్తం పఠిస్తారు. బ్రహ్మోత్సవాల్లో అర్చక పండితులు రోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోసి నారు పెరిగేందుకు సహకరిస్తారు. ఈ మొత్తం వ్యవహారమంతా వేద మంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహిస్తారు. ఇక శనివారం నిర్వహించనున్న శ్రీవారి కల్యాణోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నేడు ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు
అంకురార్పణ
రేపు కాటమరాయుడి కల్యాణోత్సవం


