హంద్రీ–నీవా పనుల నాణ్యతలో రాజీపడొద్దు
పుట్టపర్తి: హంద్రీ–నీవా పనులన్నీ పూర్తి చేసి పుట్టపర్తి నియోజకవర్గంలోని 195 చెరువులను నింపడమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. గురువారం బుక్కపట్నం మండలం జానకంపల్లి వద్ద హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువ, పంప్ హౌస్ పనులను ఆయన పరిశీలించారు. గ్రామం వద్ద హంద్రీనీవా కాలువ (344.90 కిలోమీటర్)ను తనిఖీ చేసి వెడల్పు, నీటి సామర్థ్యం, ప్రవాహ వేగం తదితర వివరాలను ఎస్‌ఈ రాజ్ స్వరూప్‌ను అడిగి తెలుసుకున్నారు. ఓటీ–3 ద్వారా సుమారు 143 చెరువులకు నీరు అందించే అవకాశం ఉన్నందున సదరు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. జానకంపల్లి వద్ద ఉన్న పంప్ హౌస్ –3, యార్డ్ పనులను తనిఖీ చేశారు. అక్కడ ఉపయోగిస్తున్న పైపులు, వాటికి వేస్తున్న కోటింగ్ పెయింట్ మందం, నాణ్యతా ప్రమాణాలను స్వయంగా పరిశీలించారు. పనుల్లో ఎక్కడా రాజీ పడరాదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సువర్ణ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎస్‌ఈ రాజ్ స్వరూప్, ఈఈ గిరిధర్‌రెడ్డి, ఏఈఈలు సిబ్బంది ఉన్నారు.
195 చెరువులను నింపడమే
లక్ష్యంగా పనులు చేయాలి
అధికారులకు కలెక్టర్
శ్యాంప్రసాద్ ఆదేశం


