జిల్లాలో చింత పండు ధరలు తగ్గుతున్నాయి. దిగుబడి అధికంగా
హిందూపురం: ఈ సీజన్‌లో హిందూపురం మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున్న చింత పండును విక్రయానికి రైతులు తీసుకు వస్తున్నారు. ప్రతి వారం దాదాపు 3 వేల నుంచి 4వేల క్వింటాళ్ల క్రయవిక్రయాలు సాగుతున్నాయి. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా చింత పండు దిగుబడులు బాగా ఉండడమే ఇందుకు కారణం. వరుసగా గత రెండేళ్లుగా సరైన దిగుబడి లేక నష్టాల పాలైన రైతులు.. ఈ సారి అధిక దిగుబడి కారణంగా మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక నష్టపోవాల్సి వస్తోంది.
సరైన ధరలు లేక కుదేలు..
గత వారం నుంచి మార్కెట్‌కు పెద్ద మొత్తంలో చింత పండు వస్తోంది. గత ఏడాది మొదటి రకం కరీపులి రకం చింతపండు అత్యధికంగా రూ.25 వేలకు పైగా ధర పలికింది. ప్రస్తుతం రూ. 8 వేల నుంచి రూ.10 వేలకు మించి అడగడం లేదు. అలాగే ఫ్లవర్ రకం చింతపండు ధర రూ.10 వేల నుంచి రూ.22 వేలలోపే ఉంటోంది. బోటు రకం రూ.3 వేల నుంచి రూ.6 వేలకు మించి అమ్ముడు పోవడం లేదు. దీంతో ధర గిట్టుబాటు కాక రైతులు లబోదిబోమంటున్నారు.
ఎటొచ్చి రైతుకే నష్టం..
మార్కెట్ యార్డులో వ్యాపారులు, అధికారుల మాయాజాలానికి రైతులు బలవుతున్నారు. వేలం సమయంలో వారు చెప్పిన ధరకే చింతపండును విక్రయించుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం చింతపండు దిగుబడి పెరిగి ఎక్కువ లోడ్లు మార్కెట్‌కు వస్తున్నాయి. దీంతో తక్కువ ధరతో వేలం పాడుతున్నారు. చెట్టు నుంచి చింత కాయలను దులిపేందుకు ఒక్కో కూలీకి రూ.800, వాటిని శుభ్రం చేసేందుకు ఒక్కో కూలీకి రూ.600 చొప్పున కూలి చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. మార్కెట్ యార్డుకు తరలించేందుకు వాహన అద్దెలు అదనమంటున్నారు. ఇంత కష్టపడి యార్డుకు సరుకు చేరిస్తే ఇక్కడ గిట్టుబాటు ధర లేకుండా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ ఆరంభంలో ఉన్న ధర ఆ తర్వాత లేకుండా పోయిందంటున్నారు. కూలీలు, రవాణా, ఏజెంట్ల కమీషన్, తూకాలన్నీ పోనూ తమకు మిగిలిదే నష్టమేనని వాపోతున్నారు.
పెరిగిన చింత పండు దిగుబడులు
మార్కెట్‌లో నానాటికీ దిగజారుతున్న ధరలు
గిట్టుబాటు కావడం లేదంటున్న రైతులు
హిందూపురంలోని మార్కెట్ యార్డుకు రైతులు తీసుకు వచ్చిన చింతపండు


