నేడు జిల్లా జేఏసీ ఎన్నికలు
పుట్టపర్తి టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమాఖ్య జిల్లా జేఏసీ ఎన్నికలు పుట్టపర్తిలోని ఎన్జీఓ హోంలో శుక్రవారం సాయంత్రం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు లింగా రామ్మోహన్, కార్యదర్శి ఈశ్వరనాయక్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
చీనీ చెట్ల నరికివేత
బత్తలపల్లి: మండలంలోని గుమ్మల్లకుంట గ్రామ రైతు మరిమడుగు మల్లిరెడ్డికి చెందిన తోగలోని 25 చీనీ చెట్లను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేశారు. బాధిత రైతు తెలిపిన మేరకు.. తనకున్న పొలంలో 2.10 ఎకరాల్లో రెండున్నర సంవత్సరాల క్రితం 246 చీనీ మొక్కలను నాటాడు. చెట్లు బాగా ఎదుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పొలంలో గడ్డిని తొలగించేందుకు గురువారం కూలీలను ఏర్పాటు చేసి, తాను మరో ప్రాంతానికి వెళ్లాడు. అయితే తోట వద్దకు వెళ్లిన కూలీలు అక్కడ చీనీ చెట్లను నరికి వేసిన విషయాన్ని గుర్తించి, సమాచారం ఇవ్వడంతో మల్లిరెడ్డి వెంటనే అక్కడకు చేరుకున్నాడు. కాగా, ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎస్‌ఐ సోమశేఖర్ వెల్లడించారు.
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
అనంతపురం సెంట్రల్: నగరంలోని మూడో పట్టణ పీఎస్ కానిస్టేబుల్ నజీరుద్దీన్ (పీసీ 1804) గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సుదీర్ఘకాలం సీఐడీ విభాగంలో పనిచేసిన ఆయన ఇటీవల త్రీటౌన్ పోలీసుస్టేషన్‌కు బదిలీపై వచ్చారు. గురువారం మధ్యాహ్నం రాజీవ్‌కాలనీలోని తన నివాసంలో కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
వివాహిత అనుమానాస్పద మృతి
పరిగి: మండలంలోని పెద్దిరెడ్డిపల్లికి చెందిన వివాహిత ప్రతిభ (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి బంధువులు తెలిపిన మేరకు... హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని ముదిరెడ్డిపల్లికి చెందిన మల్లికార్జున, రాధమ్మ దంపతుల కుమార్తె ప్రతిభకు రెండేళ్ల క్రితం పెద్దిరెడ్డిపల్లికి చెందిన జ్యోతిష్ కుమార్‌తో వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. గురువారం సాయంత్రం ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, బంధువులు పెద్దిరెడ్డిపల్లికి చేరుకున్నారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. అదనపు కట్నం కోసం వేధించేవాడని, ప్రతిభను భర్త, ఆయన కుటుంబసభ్యులే చంపి ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
నేడు జిల్లా జేఏసీ ఎన్నికలు
నేడు జిల్లా జేఏసీ ఎన్నికలు


