మండలిలో చర్చకు వెనుకంజ ఎందుకో?
పెనుకొండ రూరల్: వైఎస్సార్‌సీపీకి బలం లేని అసెంబ్లీలో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అంటూ గగ్గోలు చేసిన ప్రభుత్వ పెద్దలు.. ఇదే అంశంపై శాసన మండలిలో ఎందుకు నోరు మెదపలేకపోయారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్ ప్రశ్నించారు. గురువారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కల్తీ వివాదం చంద్రబాబు ప్రభుత్వ అభూత కల్పనలో ఓ భాగమేనన్నారు. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీ లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పినా... ప్రభుత్వ పెద్దలు మాత్రం వక్రీకరిస్తూ హిందువుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై ప్రభుత్వ కుట్రను ఆధారాలతో సహ తేటతెల్లం చేసేందుకు శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉండగా... అధికార పార్టీకి దమ్ము లేక చర్చను తిరిగి అసెంబ్లీకి మార్చడం సిగ్గు చేటన్నారు. సంఖ్యాబలమున్న అసెంబ్లీలో వారు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి సరికాదన్నారు. కల్తీ వివాదంలో గత ప్రభుత్వ అధినేతకు సంబంధం లేదనే రీతిలో అసెంబ్లీ సాక్షిగా డీసీఎం పవన్‌కళ్యాణ్ మాట్లాడడం చూస్తుంటే ఇదంతా చంద్రబాబు కుట్రగానే స్పష్టమవుతోందన్నారు. కల్తీ వివాదాన్ని సృష్టించిన నేతలు బేషరత్తుగా శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐపీఎస్ అధికారి సునీల్‌నాయక్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు బిహార్‌కు వెళ్లడం రెడ్‌బుక్ రాజ్యాంగంలోని భాగమేనని అన్నారు.
ప్రజలకు ఉపయోగం లేని బడ్జెట్..
ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేనిదన్నారు. ఎన్నికల సమయంలో వరాలు కురిపించిన నాయకులు... అధికారం చేపట్టిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. సూపర్ సిక్స్ సంపూర్ణంగా అమలు కాలేదన్నారు. నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్ అమలు, ఉచిత గ్యాస్ సిలిండర్ తదితర హామీలను ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రఘురామరెడ్డి, కన్వీనర్లు వెంకటేష్, సుధాకర్‌రెడ్డి, నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, సురేష్, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్


