గురువులను గౌరవించడం నేర్చుకోండి : సీఐ
పెనుకొండ: అల్లరి పనులతో జీవితాలను పాడు చేసుకోకుండా గురువులను గౌరవించడం నేర్చుకోవాలని విద్యార్థులను సీఐ రాఘవన్ మందలించారు. వివరాల్లోకి వెళితే.. పెనుకొండలోని సెంట్రల్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు బృందంగా ఏర్పడి అల్లరి పనులతో ఉపాధ్యాయినులకు తలనొప్పిగా మారారు. ఎన్ని సార్లు మందలించినా వారిలో మార్పు రాకపోవడంతో చివరకు తల్లిదండ్రులను పిలుచుకుని రావాలని సూచించారు. దీంతో గురువారం ఉదయం పిల్లలతో కలసి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. ఆ సమయంలో టీచర్లతో తల్లిదండ్రుల వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న సీఐ రాఘవన్ అక్కడకు చేరుకుని విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రవర్తన గురించి తెలుసుకున్న సీఐ వారిని తీవ్ర స్థాయిలో మందలించారు. అనవసరమైన పొరబాట్లతో జీవితాలను పాడు చేసుకోవద్దని, విద్యాబుద్ధులు నేర్పే గురువులకు తగిన గౌరవం ఇవ్వాలని హితవు పలికారు. త్వరలో పదో తరగతి పరీక్షలు ఉన్న నేపథ్యంలో చక్కగా చదువుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని సూచించారు. అనంతరం తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.
వ్యక్తి అదృశ్యం విషాదాంతం
అనంతపురం సెంట్రల్: నగరంలో మారుతీ సప్లయర్స్ నిర్వాహకుడు పుట్లూరు రామాంజనేయులు అదృశ్యం విషాదంతంగా ముగిసింది. గుల్జార్‌పేటలో నివాసముంటున్న ఆయన ఈ నెల 21న స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలో హెచ్చెల్సీలో గల్లంతైన విషయం తెలిసిందే. కారులో హెచ్చెల్సీ వద్దకు చేరుకున్న ఆయన డ్రైవర్‌ను అరటి పండ్ల కోసమని పంపాడు. తిరిగి వచ్చేసరికి కాలువ గట్టుపై పర్సు మాత్రమే ఉండడంతో డ్రైవర్‌కు అనుమానం వచ్చి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న మూడో పట్టణ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో సిబ్బంది మూడు రోజుల పాటు కాలువలో విస్తృత గాలింపు చేపట్టారు. ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆయన ఎటో వెళ్లిపోయి ఉంటాడని భావించారు. అయితే ఆరు రోజుల తర్వాత గురువారం బుక్కరాయసముద్రం మండల పరిధిలో కాలువలో గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం కనిపించింది. కుటుంబ సమస్యలతోనే ఆయన ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ తెలిపారు.


