స్పౌజ్‌.. నిబంధనలు తూచ్‌ | - | Sakshi
Sakshi News home page

స్పౌజ్‌.. నిబంధనలు తూచ్‌

Jan 14 2026 7:12 AM | Updated on Jan 14 2026 7:12 AM

స్పౌజ్‌.. నిబంధనలు తూచ్‌

స్పౌజ్‌.. నిబంధనలు తూచ్‌

అనంతపురం: జిల్లాలో గత ఏడాది జూన్‌లో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగాయి. స్పౌజ్‌ కేటగిరీలో నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. వెసులుబాటును అడ్డగోలుగా మార్చుకుని కోరుకున్న చోటుకు బదిలీ అయ్యేలా కొందరు ఉపాధ్యాయులు వ్యవహరించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యాబుద్ధులు నేర్పే గురువులే.. కొంతమంది అడ్డదారిలో వెళ్లారనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు.

కమిషనర్‌ ఆదేశాలు బేఖాతర్‌

స్పౌజ్‌ అంశంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ కొందరు స్పౌజ్‌ కోటాను దుర్వినియోగం చేసుకున్నారు. నిజాయితీ ఉపాధ్యాయులు పట్టణాలకు దూరంగా.. అక్రమంగా వ్యవహరించిన వారికి కోరుకున్న స్థానాలు దక్కాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. నిబంధనలు పాటించని ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్పౌజ్‌ను దుర్వినియోగం చేసిన ఉపాధ్యాయుల వివరాలతో సహా డీఈఓ కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

● గతేడాది జూన్‌లో మొత్తం 7,152 మంది ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. స్కూల్‌ అసిస్టెంట్‌లు 3,478 మంది, ఎస్జీటీలు 3,208 మంది, పండిట్లు 111 మంది, పీఈటీలు 29 మంది, గ్రేడ్‌–2 హెచ్‌ఎంలు 133 మంది, పీఎస్‌ హెచ్‌ఎంలు 193 మంది బదిలీ అయ్యారు. స్పౌజ్‌ కేటగిరిలో బదిలీ పొందిన వారిలో మొత్తం 40 మంది స్పౌజ్‌ కోటాను దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులపై తాజాగా విచారణ జరుగుతోంది.

స్పౌజ్‌ అక్రమాల్లో మచ్చుకు...

● బత్తలపల్లి మండలం మాల్యవంతంలో పనిచేస్తున్న టీచర్‌ 2021లో బదిలీ అయ్యారు. రేషనలైజేషన్‌లో ప్రస్తుతం పోస్టు పోయింది. ఈ నేపథ్యంలో ఆమెకు 14.75 పాయింట్లు రావాల్సి ఉంటే.. 24 పాయింట్లు నమోదు చేసుకుని బదిలీకి దరఖాస్తు చేశారు. ఓల్డ్‌స్టేషన్‌ పాయింట్లను కూడా కలుపుకుని దరఖాస్తు చేశారు. దీంతో మంచి స్థానం దక్కింది.

● నార్పల మండలం తిమ్మంపల్లిలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు 36 పాయింట్లకు బదులు .. 38 పాయింట్లు నమోదు చేసుకున్నారు.

● ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్లలో టీచర్‌ 13 పాయింట్లకు గాను.. 31 పాయింట్లు నమోదు చేశారు.

● భర్త ధర్మవరంలో పనిచేస్తుండగా.. భార్య పామిడి మండలానికి బదిలీ చేశారు. వాస్తవానికి ధర్మవరం సమీప ప్రాంతాల్లో బదిలీ కావాల్సి ఉండగా.. పామిడి మండలానికి బదిలీ అయ్యేలా ఆప్షన్లు ఇచ్చారు.

● పుట్లూరు మండలం కడవకల్లులో స్కూల్‌ అసిస్టెంట్‌ –మేథమేటిక్స్‌గా పనిచేస్తున్నారు. పీఎస్‌హెచ్‌ఎంగా పెద్దపప్పూరు మండలం అమళ్లదిన్నెకు వెళ్లారు. స్పౌజ్‌ సర్టిఫికెట్‌ కడవకల్లులో పనిచేస్తున్నట్లు ఇచ్చారు. ఆ ప్రకారం గణిత టీచర్‌గా ఉన్న ఆయన భార్య పుట్లూరు మండలానికి వెళ్లాలి. లేదా బదిలీ అయిన పెద్దపప్పూరు మండలానికి వెళ్లాలి. ఈ రెండూ కాదని.. ఆత్మకూరు మండల కేంద్రానికి బదిలీ వచ్చింది.

● గార్లదిన్నె మండల కేంద్రంలో పనిచేస్తున్న ఓ టీచర్‌ భార్య ..నిబంధనలకు విరుద్ధంగా నార్పల మండలానికి వెళ్లారు.

● చిలమత్తూరు మండలం సోమగుట్ట జెడ్పీ హెచ్‌ఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ టీచర్‌ భార్య స్పౌజ్‌ వినియోగించుకున్నారు. గోరంట్లకు బదిలీ అయ్యారు. వాస్తవానికి చిలమత్తూరు మండలంలో ఆప్షన్‌ ఇచ్చుకోవాల్సి ఉండగా.. గోరంట్లకు ఆప్షన్‌ ఇచ్చారు.

ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు

స్పౌజ్‌ కేటగిరీ దుర్వినియోగంతో కోరుకున్న స్థానానికి..

వాస్తవానికి స్పౌజ్‌ ఎక్కడ ఉంటే ఆ పరిసర ప్రాంతాలకే అవకాశం

ఫిర్యాదులపై తాజాగా విచారణ

దుర్వినియోగం చేస్తే చర్యలు

స్పౌజ్‌ దుర్వినియోగం చేసి.. అనుకూలమైన స్థానాల్లో బదిలీ పొందిన ఉపాధ్యాయుల వివరాలపై ఫిర్యాదులు అందాయి. వీటిపై విచారణ చేయాలని అనంతపురం ఉప విద్యాశాఖాధికారిని నియమించాం. సమగ్ర దర్యాప్తు అనంతరం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటాం.

– ప్రసాద్‌ బాబు, డీఈఓ, అనంతపురం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement