కంది కొనుగోలు కేంద్రాలేవీ?
మడకశిర రూరల్: ఆరుగాలం కష్టించి దేశానికే అన్నం పెట్టే రైతన్నలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. అంతులేని అలసత్వం ప్రదర్శిస్తూ సహనాన్ని పరీక్షిస్తోంది. సర్కారు నుంచి ఎలాంటి చేయూత దక్కకపోవడంతో విసిగిపోతున్న రైతులు చేసేదిలేక పంట ఉత్పత్తులను నష్టాలకే అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం కంది రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. కందుల కొనుగోలు కేంద్రాల కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం క్వింటాల్ కందికి రూ.8 వేల మద్దతు ధర ప్రకటించిందంటూ గత నెల డిసెంబర్ 22న వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రైతులు ఆర్‌ఎస్‌కేల్లో పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. దీంతో రైతులు ఆశతో పేర్లు నమోదు చేసుకున్నారు.
ప్రైవేటుకు విక్రయం..
ఎకరాలో కంది పంట సాగుకు దాదాపు రూ.15 వేల వరకు రైతులు ఖర్చు చేశారు. మడకశిర నియోజకవర్గంలో 6 వేల ఎకరాలకుపైగా కంది పంట సాగైంది. ఇటీవల రైతులు పంటను కోసి విక్రయించడానికి వీలుగా నూర్పిళ్లు చేసి కంది విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు కందుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. దీంతో కొంత మంది రైతులు ఇంట్లో నిల్వ ఉంచుకోలేక ప్రైవేటుగా వ్యాపారులకు క్వింటాల్ రూ.5,800 నుంచి రూ.6 వేల వరకు విక్రయిస్తున్నారు. అయితే, ఈ ధరకు విక్రయిస్తే పెట్టిన పెట్టుబడి కూడా గిట్టుబాటు కావడం లేదని, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చేసేదిలేక తెగనమ్ముకోవాల్సి వస్తోందంటూ అన్నదాతలు వాపోతున్నారు.
ఆర్భాటంగా ప్రకటనలు చేసిన చంద్రబాబు సర్కారు
చర్యలు మాత్రం శూన్యం
ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాతలు
రైతులను ఆదుకోవాలి
కంది పంటను కోసి నూర్పిడి చేశా. చంద్రబాబు ప్రభుత్వం కందులను కొనుగోలు చేస్తామని చెప్పడంతో ఇంట్లోనే నిల్వ చేశా. పంటకు ఈ–క్రాప్ బుకింగ్ కూడా చేయించా. అయితే, ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం మాత్రం ఏర్పాటు చేయలేదు. వెంటనే కేంద్రాన్ని ప్రారంభించి రైతులను ఆదుకోవాలి.
– శ్రీరామరెడ్డి, రైతు, ఎల్లోటి గ్రామం,
మడకశిర మండలం
ఇంకా ఆలస్యం చేయొద్దు..
వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయా. ఈ ఏడాది అప్పులు చేసి కంది పంట సాగు చేశా. పంటను కోసి ఎండబెట్టి నూర్పిడి చేయడానికి సిద్ధంగా ఉంచా. మార్కెట్‌లో తక్కువ ధర ఉండడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే కందుల కోనుగోలు కేంద్రం కోసం ఎదురు చూస్తున్నాను. ఆలస్యం చేయకుండా కొనుగోలు చేసి ఆదుకోవాలి.
– ఉమాశంకర్, రైతు, ఏఆర్ రొప్పం,
మడకశిర మండలం
కంది కొనుగోలు కేంద్రాలేవీ?
కంది కొనుగోలు కేంద్రాలేవీ?


