పాసు పుస్తకాల పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి
●జేసీ మౌర్య భరద్వాజ్
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలని జేసీ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 2 నుంచి 9 వతేదీ వరకూ పాసు పుస్తకాల పంపిణీ చేపట్టాలన్నారు. ఈ క్రమంలో పాటించాల్సిన విధివిధానాలు, ముందస్తు ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. గతంలో రీ సర్వే పూర్తయినా ఇంకా పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కాకుండా ఉన్న గ్రామాల విషయంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున ఎంపిక చేయాలన్నారు. అర్హులైన ప్రతి రైతుకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పాసు పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రీ సర్వేపై సందేహాలు నివృత్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓలు సువర్ణ, వీవీఎస్ శర్మ, ఆనంద్‌కుమార్, ఏఓ సక్సేనా, తహసీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సేవలు సకాలంలో అందించాలి
ధర్మవరం అర్బన్: ప్రజలకు రెవెన్యూ సేవలు సకాలంలో అందించాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమావేశ భవనంలో మంగళవారం ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల పంపిణీ, దీపం పథకం తదితర సంక్షేమ పథకాలను అర్హులకు సమర్థవంతంగా చేర్చాలన్నారు. పీజీఆర్‌ఎస్ దరఖాస్తులను గడువులోపు పరిష్కరించి ప్రజల్లో నమ్మకం పెంచాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ మహేష్, సర్వేశాఖ ఏడీ విజయశాంతి తదితరులు పాల్గొన్నారు.
ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోండి
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో గత డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్ షిప్ పరీక్షకు హాజరైన విద్యార్థులు వారి కుల, ఆదాయ, 7వ తరగతి మార్కుల ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని డిఈఓ కిష్టప్ప ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల హెచ్‌ఎంల వెబ్‌సైట్ www.bse.ap.gov.inను గమనిస్తూ ఉండాలన్నారు. త్వరలో విద్యార్థుల పత్రాలను పరిశీలనార్థం పంపుతామని, ఆ సమయంలో అడిగిన వెంటనే హాల్‌టికెట్ జిరాక్స్‌తో సహా అన్ని పత్రాలను అందజేయాలన్నారు. లేకుంటే విద్యార్థుల వివరాలను జాబితా నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు.
డబ్బుల డిమాండ్ ఆరోపణలపై విచారణ
పుట్టపర్తి అర్బన్: ప్రైవేటు ఆసుపత్రుల నుంచి డబ్బు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై డీఎంహెచ్‌ఓ ఫైరోజాబేగంను ఉన్నతాధికారులు విచారించారు. హిందూపురంలో ఉన్న పలు ప్రైవేటు ఆసుపత్రుల రెన్యూవల్స్‌కు డబ్బు డిమాండ్ చేసినట్లు ఆర్‌డీకి, ఐఎంఏకు ఫిర్యాదులు అందడంతో మంగళవారం రీజినల్ డైరెక్టర్ గిడ్డయ్య ఉదయం నుంచి సాయంత్రం వరకూ విచారించినట్లు తెలిసింది. పలు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు విచారణలో పాల్గొన్నట్లు సమాచారం.


