చంద్రబాబును నమ్మి మోసపోయాం
పరిగి: ‘నమ్మి ఓట్లేసినందుకు బాగా బుద్ధి వచ్చింది.. సూపర్ సిక్స్ అంటూ మమ్మల్ని మోసం చేసిన చంద్రబాబును భవిష్యత్తులో నమ్మబోము’ అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ ఎదుట ప్రజలు వాపోయారు. మండలంలోని బీచిగానిపల్లి పంచాయతీ వంగలపల్లి, పాత్రగానిపల్లిలో మంగళవారం ‘కాఫీ విత్ వైఎస్సార్‌సీపీ లీడర్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ కన్వీనర్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఉషశ్రీచరణ్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తొలుత వంగలపల్లిలో పర్యటించిన ఉషశ్రీచరణ్ ప్రతి గడపకూ వెళ్లి ప్రజల సాదకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మహిళలు, రైతులతో ఆమె మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వ తీరు బాగుందా అంటూ ప్రశ్నించగా ఏమీ బాగోలేదని ఉషశ్రీచరణ్‌తో నిర్మొహమాటంగా తెలిపారు. గొల్లపల్లికి చెందిన రైతు ఆనందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో చేయూతన లేక వ్యవసాయం భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న హయాంలో పండిన ప్రతి పంటకూ గిట్టుబాటు ధర కల్పించేవారని, పైగా ఏటా రైతు భరోసా నగదు, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందించారని, కొనుగోలు కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి ఆదుకున్నారన్నారు. ప్రస్తుతం రైతాంగాన్ని నట్టేట ముంచడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నైజం యావత్ రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందన్నారు. రైతుల చేతికి చిప్పందించారని, చివరకు అడుక్కుతినే పరిస్థితి కల్పించారని వాపోయారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన తమకు సంక్షేమ పథకాలను అందించడం లేదని ఉషశ్రీచరణ్ ఎదుట మహిళలు వాపోయారు. టీడీపీ నాయకులకు దండం పెట్టేవారికే ఇళ్లు, పింఛన్లు, చివరకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నారంటూ ఉషశ్రీచరణ్ దృష్టికి తెచ్చారు. కుల,మత,రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించిన జగనన్న ప్రభుత్వాన్ని మరలా తెచ్చుకుంటామని స్పష్టం చేశారు.
జగనన్న సీఎంగా ఉన్నన్ని రోజులూ మాకు కష్టాలుండేవి కావు
ఉషశ్రీచరణ్ ఎదుట వాపోయిన జనం
రైతుల ఉసురు తగులుతుంది
ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని మభ్యపెట్టి నేటికీ కనీసం అమరావతి రైతులకు భరోసా కల్పించని చంద్రబాబు ప్రభుత్వానికి కచ్చితంగా వారి ఉసురు తగులుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. విలేకరులతో ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏనాడూ అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని, అమరావతి పేరున భూదందా చేస్తున్న వారికి మాత్రమే వ్యతిరేకమని జగనన్న ఏనాడో చెప్పారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కోసం చేసిన అప్పులను భూతద్దంలో చూపించిన చంద్రబాబు.. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్లలోపే రెట్టింపు అప్పులు చేయడాన్ని ఏమంటారని ప్రశ్నించారు. పచ్చ మీడియాలో ఉత్త రాతలతో రోత పుట్టిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధిని ప్రపంచదేశాలకు పరిచయం చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి మంత్రి సవితకు లేదన్నారు. నియోజకవర్గంలో మట్టి దోపిడీ, ఇసుక దందాను ప్రోత్సహిస్తున్న ఆమె అవినీతి అక్రమాలపై మాట్లాడి నవ్వులపాలవుతున్నారన్నారు. మట్టిని, ఇసుకను తింటూ, డీజిల్ తాగుతూ అవినీతిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఘనత సవితకే దక్కిందన్నారు. స్వయానా కన్న తల్లే కేసు వేసిన సంగతి మర్చిపోయావా అంటూ దుయ్యబట్టారు. సొంత పంచాయతీలో బెల్టు షాపులు పెట్టించి అభివృద్ది చేస్తున్నామని ప్రగల్బాలు పలకడమేంటని, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్లను ఎప్పుడిస్తారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. మరోసారి జగనన్న కుటుంబంపై నోరు పారేసుకుంటే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.


