మట్టి నుంచి బంగారం!
రామగిరి: మట్టిలోంచి మాణిక్యాలు పుడతాయంటారు. అతని చేయి పడితే మట్టి బంగారమవుతుందంటారు... అలాగే రామగిరి వాసులు మట్టి నుంచి బంగారాన్ని వెలికి తీస్తున్నారు. వినేందుకు విడ్డూరంగా ఉన్నా...ఇదే నిజం. ట్రాక్టర్ మట్టిని ఓ కుటుంబమంతా కలిసి ఓ 10 రోజుల్లో నీటితో కడిగితే తులం బంగారం దొరుకుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో తులం బంగారం రూ.లక్ష దాటగా...మట్టినే నమ్ముకున్న రామగిరి వాసుల జీవితాలు బంగారంగా మారాయి.
కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్)కు అనుబంధంగా ఉండే భారత్ గోల్డ్‌మైన్స్ లిమిటెడ్ (బీజీఎంఎల్) కంపెనీ రామగిరి గనుల నుంచి బంగారాన్ని వెలికితీసేది. అయితే వివిధ కారణాలతో ఒకేసారి ఈ రెండు కంపెనీలు మూతపడ్డాయి. అనంతరం రామగిరి బంగారు గనులను తెరిపించేందుకు జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఖాయిలాపడ్డ ఈ పరిశ్రమలోని సామగ్రిని మహారాష్ట్రకు చెందిన నేషనల్ డైమండ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌డీసీఎల్) టెండర్ ద్వారా దక్కించుకుని గత ఏడాది ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో తరలించింది. దీంతో అక్కడ సెక్యూరిటీ కూడా లేదు. దీంతో ఖాళీగా ఉన్న ఆ ప్రాంతంలోని మట్టిని స్థానిక ప్రజలు తవ్వుకుని తమ ఇళ్లవద్దకు తరలించుకుంటున్నారు. ఆ మట్టిని నీటితో పలుమార్లు కడిగి, వడబోయగా చివరలో కొంత బంగారం లభిస్తోంది. ఇలా ట్రాక్టర్ మట్టికి పలుమార్లు కడిగి వడబోయగా...తులం దాకా బంగారం లభ్యమవుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఒకరిని చూసి మరొకరు..ఇలా గ్రామమంతా మట్టి నుంచి బంగారాన్ని వెలికి తీయడాన్నే ఉపాధిగా మలచుకుంది. మరికొందరు సమీపంలోనున్న ఆర్డీటి చెక్‌డ్యాం వద్దకు మట్టిని తరలించుకొని ఆ మట్టిని నీటిలో కడిగి... వడబోసి బంగారం వెలికి తీస్తున్నారు.
గతమెంతో ఘనం..
రామగిరి బంగారు నిక్షేపాలకు నిలయం. అందుకే శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచీ ఈ ప్రాంతంలో బంగారాన్ని వెలికి తీసేవారు. కేంద్ర ప్రభుత్వం 1972లో రామగిరిలో భారత్ గోల్డ్‌మైన్స్ లిమిటెడ్ (బీజీఎంఎల్) పేరుతో పరిశ్రమను ప్రారంభించింది. 2001 వరకు ఇక్కడ బంగారాన్ని వెలికితీశారు. 1984లో ఏకంగా 13 కేజీల బంగారాన్ని రామగిరి గని నుంచే వెలికితీసినట్లు కార్మికులు చెబుతున్నారు. ఇక్కడ వేప మాను, జమ్మి మాను, చెన్నేబావి, జిప్టాల్, హరిహరరాయలు తదితర పేర్లతో ఐదు బంగారు గనులుండగా.. అప్పట్లో సరైన యంత్ర పరికరాలు లేక పదిశాతం బంగారాన్ని మాత్రమే వెలికి తీశారని, ఇంకా 90 శాతం బంగారం నిక్షేపాలు ఆయా గనుల్లో ఉన్నట్లు అప్పట్లో పనిచేసిన కార్మికులు చెబుతున్నారు.
రామగిరిలోని బంగారు గని
ప్రాంతం నుంచి మట్టి సేకరణ
ఆ మట్టిని వివిధ రకాలుగా
శుద్ధి చేసి బంగారం వెలికితీత
ట్రాక్టర్ మట్టిలో
తులం దాకా బంగారం
ఉపాధిగా మలచుకున్న
రామగిరి వాసులు


