ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద
హిందూపురం: అనంత మేధాశక్తితో యువతను మేల్కొల్పిన స్వామి వివేకానందుడు అందరికీ ఆదర్శప్రాయుడని అడిషనల్ జిల్లా జడ్జి కంపల్లె శైలజ పేర్కొన్నారు. సోమవారం ఏడీజే కోర్టు ఆవరణలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏడీజేతో పాటు పలువురు న్యాయవాదులు స్వామి వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏడీజే శైలజ మాట్లాడుతూ.. ఉన్నత భావాలతో సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు. ఓటమికి కుంగిపోకుండా మళ్లీ ప్రయత్నించినప్పుడే గెలుపు సాధ్యమవుతుందన్నారు. వివేకానందుడు చెప్పినట్లు కర్తవ్యాలు నిర్వహించాలే తప్ప.. ప్రతిఫలం ఆశించవద్దన్నారు. ప్రస్తుతం కొందరు యువకులు చెడు అలవాట్లకులోనై పెడదోవ పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువత అనవసర విషయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సమయాన్ని వృథా చేసుకోకుండా ఉన్నత ఆశయాలతో ముందుకు వెళుతూ సమాజహితం కోసం పాటుపడాలని సూచించారు. స్వామి వివేకానందుడు చెప్పినట్లు సత్యం, అహింస, ఆధ్యాత్మిక, మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు సుదర్శన్, సత్యనారాయణ, రాజశేఖర్, మురళీ, మనోహర్, కృష్ణమూర్తి, వర్షారెడ్డి, ఆంజనేయులు, వీరసేన, భాను ప్రకాష్, సందీప్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ


