తప్పుల్లేని పాసు పుస్తకాలు అందించాలి
● జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశం
ప్రశాంతినిలయం: రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు తప్పుల్లేని పాసుపుస్తకాలు వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని జేసీ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఎస్పీ సతీష్ కుమార్‌తో కలిసి సీఎం చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. జిల్లాలో జీఎస్‌డీపీకి అనుగుణంగా వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తప్పుల్లేని పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దీపికకు గణతంత్ర వేడుకల ఆహ్వానం
హిందూపురం టౌన్: భారత అంధుల మహిళా క్రికెట్ టీ–20 జట్టు కెప్టెన్ దీపికకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు దీపికను ఆహ్వానిస్తూ రాష్ట్రపతి పంపిన పత్రిక సోమవారం దీపికకు అందింది. అమరాపురం మండలం తంబలహట్టి గ్రామానికి చెందిన తిమ్మప్ప కుమార్తె దీపిక భారత అంధుల మహిళల టీ–20 జట్టుకు నాయకత్వం వహించి ప్రపంచ కప్పును సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి నుంచి పంపిన ఆహ్వాన పత్రికను హిందూపురం తపాలా అధికారులు సోమవారం నేరుగా దీపిక స్వగ్రామానికి వెళ్లి అందజేశారు.
ఐసీడీఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
పుట్టపర్తి అర్బన్: ఐసీడీఎస్‌లో ఖాళీగా ఉన్న జిల్లా కో–ఆర్డినేటర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు ఐసీడీఎస్ పీడీ ప్రమీల సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికనా ఈ నియామకం ఉంటుంది. దరఖాస్తులను ఈ నెల 19వ తేదీలోపు అందజేయాలి. అభ్యర్థులకు వయస్సు.. ఇతర వివరాలకు ఐసీడీఎస్ కార్యాలయంలో సంప్రదించాలి.
తప్పుల్లేని పాసు పుస్తకాలు అందించాలి


